వర్షాల కారణంగా నలుగురు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం ప్రాణాంతకంగా మారింది. వరదనీటిలో కొట్టుకుపోయి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వైసీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన ప్రకటించారు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, వర్షాల కారణంగా మురుగు కాలువల్లో కొట్టుకుపోయి షేక్ మున్ని , ఇలియాస్, గణేష్ అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అలాగే, శుక్రవారం రాత్రి నుంచి కనిపించని బాలిక యామిని మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. ఘటనా స్థలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మాండవ్య నది పరిసరాల్లోని మురుగు కాలువలో ఆమె శవాన్ని గుర్తించారు.
మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గత మూడు దశాబ్దాల్లో రాయచోటిలో ఇంతటి భారీ వర్షం ఎప్పుడూ కురవలేదని ప్రజలు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలే ఈ విషాద ఘటనకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.