రాజ్యాంగాన్ని తిరగరాయాలి: నేపాల్ జెన్ జెడ్ డిమాండ్
నేపాల్ లోని జెన్ జెడ్ యువత చేసిన కల్లోలం అంతా ఇంతా కాదు. వారి ఆందోళనలు దేశ రాజకీయాలనే గడగడలాడించాయి. నేతలపై దాడులు, వారి ఆస్తుల ధ్వంసం వంటి చర్యలతో చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా కూడా చేయవలసి వచ్చింది. అయితే వారి డిమాండ్లు విని అధికారులు, ఆర్మీ చీఫ్ జనరల్ విస్తుపోయారు. ఇది కేవలం సోషల్ మీడియాపై నిషేధం వల్ల వచ్చిన స్పందన మాత్రమే కాదని యువత అంటోంది. గత ముప్ఫై ఏళ్లుగా రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులు దోచుకున్నారని, వారిపై విచారణ జరిపించాలని, రాజ్యాంగాన్ని తిరగరాసి, సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, దేశ భవిష్యత్తుకు పునాదిగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా రాజకీయ వారసత్వం, అవినీతి పైనే పోరాటం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇప్పుడున్న రాజ్యాంగం నేతలకు అనుగుణంగా ఉందని, రేపటి తరం కోసం వారికి అనుగుణంగా సమూల మార్పులను చేయాలని కోరుతున్నారు. ఈ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా గుర్తించి, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. నిరుద్యోగం, వలసలు, సామాజిక అన్యాయంపై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, కొత్త రాజకీయ వ్యవస్థ స్థాపనకు పిలుపునిస్తున్నారు. ఇది పార్టీలకు, మతానికి చెందినది కాదని, దేశ భవిష్యత్తు కోసమేనని వారు పేర్కొంటున్నారు.