యూరియా బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు
అమరావతి: రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, యూరియా సమస్య లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు. రబీ సీజన్లో యూరియా పంపిణీకి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సీఎం అన్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ఎరువులపై రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకూ మొత్తం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు అధికారులు ఆయనకు వివరించారు. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, ఆర్టీజీఎస్, తురకపాలెంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పది రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఎరువుల కేటాయింపుపై కేంద్రమంత్రి నడ్డాతో ఇప్పటికే మాట్లాడానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడకు వచ్చే నౌకలో 7 రేక్‌ల యూరియా ఏపీకి ఇవ్వాలని సీఎం కోరగా… అందుకు నడ్డా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.