విదేశీ ఉద్యోగాల మోజులో పడొద్దు: కేంద్రమంత్రి
దిల్లీ: విదేశాలలో వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు యువతను మోసం చేస్తున్నారని, యువత జాగ్రత్తగా ఉండాలని ఏజెంట్ల వలలో చిక్కుకోవద్దని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఆ బాధితులలో తెలుగువారు కూడా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఉద్యోగాల పేరిట మయన్మార్ చిక్కుకున్న 41 మంది భారతీయులను విదేశాంగ శాఖ బుధవారం భారత్ కు తీసుకొచ్చింది. దిల్లీకి చేరుకున్న భాధితుల్లో నలుగురు ఏపీకి చెందిన వారున్నారు. ఏపీ భవన్ లో ఆశ్రయం పొందుతున్న వీరు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిశారు. అనంతరం ఏపీ భవన్ అధికారులు బాధితులను వారి స్వస్థలాలకు పంపించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని థాయ్ లాండ్ తీసుకెళ్లి.. అక్కడి నుంచి అటవీమార్గంలో మయన్మార్ కు తరలించారని చెప్పారు. “అమెరికా, యూరప్ంటి దేశాల నుంచి ఆన్ లైన్ మోసాలకు పాల్పడేలా యువతపై ఒత్తిడి చేశారు. అలా చేయని వారిని చిత్రహింసలకు గురిచేశారు. కొందరు ఆ బాధలు తట్టుకోలేక అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్పష్టత లేకుండా యువత ఉద్యోగాలంటూ విదేశాలకు వెళ్లకూడదు. ఆన్ లైన్ స్కామ్స్ లో చిక్కొద్దు. పిల్లల్ని పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆరా తీయాలి”అని పేర్కొన్నారు

