బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్బీలు) సుమారు 50,000 మందిని నియమించుకునేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. పెరుగుతున్న తమ వ్యాపారం, విస్తరణ అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నాయి. తాజా ఉద్యోగాల్లో సుమారు 21,000 ఆఫీసర్ల విభాగంలో ఉండగా, మిగతావి క్లర్క్ లు, ఇతర సిబ్బంది ఉండనున్నారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు నియామక ప్రక్రియలో ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒక్కటే 20,000 మందిని నియమించుకునే అవకాశం ఉంది. 2025 మార్చి నాటికి ఈ బ్యాంకులో 2,36,226 మంది పని చేస్తు న్నారు. ఇందులో 1,15,066 మంది ఆఫీసర్లుగా ఉన్నారు. 2024-25లో ఒక్కో పూర్తిస్థాయి ఉద్యోగిని నియమించుకోవడానికి సగటున రూ. 40,440.59 ఖర్చయినట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 5,500కు పైగా నియామకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోతోంది. 2025 మార్చి నాటికి ఈ బ్యాంకులో 1,02,746 మంది పని చేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,000 మంది వరకు నియమించుకోనుంది. మిగతా బ్యాంకుల ఉద్యోగ నియామక వివరాలు తెలియాల్సి ఉంది.