ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరా మస్తాన్ వినియోగించిన రెండు మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులు ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ అంశంపై ఆయన నుంచి వివరాలు సేకరించేందుకు గతంలోనే ఒకసారి నోటీసులు పంపారు. అయితే, వ్యక్తిగత పనుల ఒత్తిడి కారణంగా అప్పుడు ఆయన విచారణకు హాజరు కాలేకపోయారు.

ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కీలక దశలో ఆరా మస్తాన్ వాంగ్మూలాన్ని నమోదు చేయడం అత్యవసరం అని భావించిన సిట్ అధికారులు, ఆయనకు రెండోసారి నోటీసులు పంపారు. ఈసారి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో బుధవారం సిట్ అధికారుల ఎదుట ఆరా మస్తాన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన ఇచ్చే వివరాలు కేసు దర్యాప్తులో మరింత కీలకం కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.