మోదీ కాళ్లకు నమస్కరించిన విదేశీ అధికారిణి
ప్రధాని నరేంద్ర మోదీ ద్వీపదేశమైన సైప్రస్ (Cyprus) పర్యటనలో ఆయనకు స్వాగతం పలుకుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆయనతో పాటు అక్కడి ఉన్నతాధికారులు కూడా స్వాగతం పలుకుతున్నారు. ఆ సమయంలో ఒక అధికారిణి ఆయన పాదాలను తాకి నమస్కరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా నెట్టింట వైరల్ అయ్యాయి. పాదాలు తాకిన వెంటనే స్పందించిన మోదీ.. ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. భారత సంస్కృతిపై ఆమెకున్న అభిమానాన్ని ప్రశంసించారు. పర్యటనకు సైప్రస్ కు వచ్చిన ప్రధానికి అక్కడి ప్రభుత్వం మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు. రెండు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుధైక కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు. ఈ అవార్డును ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రథమ మహిళ ఫిలిఫ్పా కర్సెరాకు ప్రత్యేక బహుమతి అందించారు. వెండితో తయారు చేసిన పర్స్ అందించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన సిల్వర్ క్లచ్ పర్స్ ఆధునిక శైలితో రూపొందించారు. రాజకళ ఉట్టిపడుతూ పర్స్ అంతా పూల డిజైన్ ఉంటుంది. మధ్యలో విలువ గల రాయిని పొదిగారు.