ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్, 8 మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జూన్ 15, 2024 శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సలైట్లు, ఓ భద్రతా అధికారి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు తెలిపారు. నారాయణపూర్, కంకేర్, దంతేవాడ మరియు కొండగావ్ అనే నాలుగు జిల్లాలకు చెందిన భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు అబూజ్మడ్ అడవిలో ఈ ఉదయం కాల్పులు జరిగినట్లు రాయ్‌పూర్‌లోని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారు. కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. నాలుగు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) 53వ బెటాలియన్ సిబ్బందితో కూడిన ఆపరేషన్ జూన్ 12న ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.


