ఒక్కరోజులో 7 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, నిమ్స్ అరుదైన రికార్డ్
నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఒక్కరోజులో మొత్తం 7 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, ఒక తుంటి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. రూపాయి ఖర్చు లేకుండానే చికిత్సలు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చేశారు. రోగులందరూ సాధారణ కోలుకుని రెండు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని నిమ్స్ ఆర్థోపెడిక్ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్ నగేశ్ తెలిపారు. నిమ్స్‌లో, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు సాధారణ ఖర్చు దాదాపు రూ. 1.4 లక్షలు ఖర్చు అవుతుండగా… ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీలో ఇలాంటి శస్త్రచికిత్స, ఆసుపత్రిని బట్టి రోగులకు రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షలు వసూలు చేస్తున్నారు. 2023లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ 470 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు తెలంగాణలోని మరే ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇన్ని ఆపరేషన్లు చేయలేదు. ఇప్పటివరకు, హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం 3, 800 శస్త్రచికిత్సలను నిర్వహించింది. ఇందులో ఆర్తోప్లాస్టీ మొదలైన వివిధ రకాల వైద్య పరిస్థితులకు శస్త్రచికిత్సలు ఉన్నాయి.