NationalNews

50 కిలోమీటర్లు.. 16 నియోజక వర్గాలు.. మోదీ రికార్డు రోడ్‌ షో

ప్రధాని మోదీ ఏది చేసినా రికార్డే. దేశంలో ఇప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు చేయని భారీ రోడ్‌ షోను మోదీ గుజరాత్‌లో నిర్వహించారు. ఏకధాటిగా 50 కిలోమీటర్ల దూరం 16 నియోజక వర్గాలను కవర్‌ చేసేలా సాగిన ఈ మెగా రోడ్‌ షో భారత దేశ చరిత్రలోనే నిలిచిపోనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని నరోదా గామ్‌ పట్టణం నుంచి ప్రారంభమైన ఈ రోడ్‌ షో గాంధీనగర్‌లో ముగిసింది. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు బీజేపీ జెండాలతో, డప్పు చప్పుళ్లతో కరతాళ నృత్యాలు చేశారు.

హిందుత్వ ప్రయోగశాలగా పేర్కొనే గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడోసారి జయకేతనం ఎగురవేసే దిశగా దూసుకెళ్తోంది. నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ రోడ్‌ షోలో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా కనిపించారు. ఇంత భారీ రోడ్‌ షోను ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడూ నిర్వహించలేదని బీజేపీ పేర్కొన్నది. ఈ సందర్భంగా ప్రధాని 35 చోట్ల ఆగి ప్రసంగించారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, సర్దార్‌  వల్లభాయ్‌ పటేల్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌తో పాటు పలువురు ప్రముఖుల స్మారక చిహ్నాల వద్ద ఆగి ప్రసంగించారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ ఇప్పటి వరకు 20 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ నెల 5వ తేదీన 93 స్థానాలకు జరిగే రెండో దశ పోలింగ్‌కు ముందు మోదీ మరో ఏడు సభల్లో ప్రసంగిస్తారు.