Andhra PradeshNews

జగన్ కంటే ఘనంగా లోకేశ్ పాదయాత్ర

జనవరి 27 నుంచి తలపెట్టనున్న పాదయాత్ర వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. పాదయాత్ర సుమారుగా 400 రోజులు పాటు ఉంటుందని.. 4 వేల కిలో మీటర్ల మేర సాగుతుందని లోకేశ్ తెలిపారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్ర ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న తాజా పరిణామాలపై ప్రజలకు వివరంగా అర్థమయ్యేలా యాత్ర ఉంటుందన తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు బాధ్యత తాను తీసుకుంటున్నానని.. మంగళగిరి గెలుపు బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి ఉపయోగించే ఆయుధాలను దీటుగా ఎదుర్కొవాలని కార్యకర్తలకు సూచించారు. పాదయాత్రలో భాగంగా మంగళగిరిలో నాలుగు రోజుల పాటు లోకేశ్ యాత్ర సాగుతుంది. తెలుగు రాజకీయాల్లో ఇప్పటి వరకు ముగ్గురు నేతలు పాదయాత్రల ద్వారా అనుకున్నది సాధించారు. వారిలో వైఎస్సార్, 2003 ఏప్రిల్ 9న పాదయాత్ర ప్రారంభించారు. 60 రోజులపాటు 1500 కిలో మీటర్ల మేర యాత్ర చేశారు.


ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ద్వారా మరో సంచలనం నమోదు చేశారు. 2012లో వస్తున్నా మీకోసం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 62 ఏళ్ల వయసులో 208 రోజులపాటు… 2,817 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. 2017 నవంబర్ 6న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 341 రోజులపాటు పాదయాత్ర చేసి 3,648 కిలో మీటర్లు నడిచారు. మొత్తంగా అగ్రనేతలు పాదయాత్రల ద్వారా ప్రజలను మెప్పించి అధికారంలోకి రాగలిగారు.