స్టెయిన్‌లెస్ స్టీల్ ఉండగా.. ప్లాస్టిక్ ఎందుకు దండగ..
వికారాబాద్: ప్లాస్టిక్ ఎన్నో అనర్థాలకు దారితీస్తోందని అందరికీ తెలుసు. దీనిని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ సంచులు, వస్తువులను నిషేధించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాల్లో నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా పలుచోట్ల ప్లాస్టిక్ వినియోగం సాగుతోంది. దీనివల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు మూగజీవాలు అనారోగ్యం పాలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించే ఉద్దేశంతో వికారాబాద్ మున్సిపల్ అధికారులు, అధ్యక్షురాలు, ప్రజాప్రతినిధులు ఒక అడుగు ముందుకు వేశారు. స్టీల్ పాత్రల బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. వివాహాది, ఇతర శుభకార్యాలకు ప్లాస్టిక్ బదులు స్టీల్ సామాగ్రిని వాడేలా చేసి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడంలో భాగంగా మెప్మా చక్కటి కార్యక్రమం చేపట్టింది. ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించడం కోసం పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రూ.3 లక్షల వ్యయంతో స్టీల్ బ్యాంకును నెలకొల్పారు.