పార్టీ మారాలని పోలీసులతో టీఆర్‌ఎస్ బెదిరింపులు
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి చండూరు చౌరస్తాలో ప్రజలతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై భగ్గుమన్నారు. తన చుట్టూ ఉన్న ప్రజాప్రతినిధులను, నాయకులను, టీఆర్‌ఎస్ నేతలు సంతలో పశువుల్లా కొనుగోలు చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించారని అన్నారు. మునుగోడు ప్రజలకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో లేరని, వారంతా బీజేపీ వైపే ఉన్నారన్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను పార్టీ మారాలని పోలీసులతో టీఆర్‌ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

తాను మూడేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడిగితే కనీసం స్పందించని కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కేసీఆర్, కేటీఆర్, కవితలకు తెలంగాణ ఉద్యమం సమయంలో పార్టీ ఫండ్ కావాలని అడిగితే తాను కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశానన్నారు. అభివృద్ధి అంటే గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే పరిమితమా? అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఎందుకివ్వరు అని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కేసీఆర్‌దెనన్నారు. పార్టీ మారితే తప్ప అభివృద్ది చేయరా అని ప్రశ్నించారు.


