ముదిరాజ్ బిడ్డలంటే అలుసా..? ఏం పాపం చేశామని గాలికొదిలేస్తావ్ కేసీఆర్!?
ప్రజాస్వామ్య హక్కుల కోసం ముదిరాజ్ వర్గం గర్జిస్తోంది. హక్కుల కోసం ఏకమవుతున్నారు. ప్రభుత్వ మెడలు వంచుతామంటూ నినదిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని… నాటికీ, నేటికీ ఎలాంటి మార్పు లేదంటూ గోస పడుతున్నారు. వ్యక్తులపై అక్కసుతో కేసీఆర్ కులాన్ని మొత్తాన్ని దోషులుగా చూస్తున్నారని.. ఇలాంటి పద్దతి మార్చుకోవాలంటూ వారు హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ముదిరాజ్ బిడ్డలను పట్టించుకోకుంటే… వచ్చే ఎన్నికల్లో సత్తా ఏంటో చూపెడతామంటున్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి మొత్తం కులాన్ని దెబ్బతీసేలా ఉందని తెలంగాణ ముదిరాజ్ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముదిరాజ్ బిడ్డలు లేకపోవడం శోచనీయమంటున్నారు. ముదిరాజ్ బిడ్డల ఓట్లు మాత్రం కావాలి.. పదవులు మాత్రం ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ వాగ్దానాలివ్వడానికి మాత్రమే పరిమితమవుతున్నారని… ఆచరణలో మాత్రం ఎలాంటి ఫలితం ఉండటం లేదంటున్నారు. తెలంగాణ అంతటా పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజ్‌లో రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో ప్రబలంగా ఉన్నారు. గ్రేటర్ హైదారాబాద్‌తో సహా, పలు జిల్లాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి ఉన్నప్పటికీ కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుని.. ఎన్నికల తర్వాత పట్టించుకోవడం లేదని ముదిరాజ్ హక్కుల ప్రతినిధులు దుయ్యబడుతున్నారు. ముదిరాజ్ బిడ్డలకు రాజకీయంగా మేలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజ్ ప్రతినిధులు ఈనెల ఎనిమిదిన ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆత్మగౌరవ నినాదాన్ని ప్రతిధ్వనించేందుకు వేదిక సిద్ధం చేసుకుంటున్నారు. క్యాబినెట్‌లో ఉన్న ఏకైక ముదిరాజ్ ప్రతినిధి ఈటల రాజేందర్‌ను వంచించిన కేసీఆర్, ఆ తర్వాత ముదిరాజ్ కులం మొత్తాన్ని శత్రువుగా చూస్తున్నారన్న భావన కలిగేలా వ్యవహరిస్తున్నారని కొందరు నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్క ముదిరాజ్ బిడ్డ బీఆర్ఎస్ పార్టీలో లేడా అంటూ మండిపడితున్నారు.
ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించడం కుల సంఘం నాయకులు మండిపడుతున్నారు. కనీసం నాయకులను పిలిచి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రావాల్సిన ప్రయోజనాలు ఏవీ కూడా ముదిరాజ్ బిడ్డలకు రాలేదని, కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సైతం అవకాశం ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ వ్యవహరశైలి చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి, ముదిరాజ్‌లు అవసరం లేదా అన్న భావన వ్యక్తమవుతోందంటున్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపాదన కేవలం కాగితాలకే పరిమితం అయిపోయిందంటున్నారు. మత్స్యకార సొసైటీల్లో ముదిరాజ్‌లకు సభ్యత్వం ఎండమావిగా మిగిలిపోయిందంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా… కక్షగట్టి కష్టపెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పంధా మార్చుకోకుంటే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామంటే నినదిస్తున్నారు.