హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో తెచ్చిన మార్పేంటి?
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో తెచ్చిన మార్పేంటి? తెలంగాణ ప్రజలకు జరిగిన మేలేంటి? దళితులకు జరిగిన మేలేంటి? 90 శాతానికి పైగా జనాభా ఉన్న బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలకు జరిగిన నష్టమేంటి? మరో 50 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో రేకెత్తుతున్న ప్రశ్నలు. తెలంగాణ కోసం, ప్రజల ఆకాంక్షల కోసం నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి వేసిన అడుగులు బీజేపీ ముఖ్యనేత, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పాలిట శాపాలయ్యాయి. తెలంగాణలో బడుగు బలహీనవర్గాల నాయకత్వం అవసరమని నినదించిన నేతలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి కేసీఆర్ చలికాచుకున్నారు.
సామాజిక తెలంగాణ ఆకాంక్షలు నెరవేరకపోవడంతో.. ప్రజలు ఎప్పటికైనా బడుగుబలహీవర్గాలకు చెందిన వ్యక్తి సీఎం పీఠంపై కూర్చోవాలని కోరుకుంటారన్న దుర్భిద్దితో కేసీఆర్ నాడు ఈటల రాజేందర్ పై వేటు వేశారు. కానీ బడుగుల కోసమే బతికిన ఈటల కేసీఆర్ రాజకీయంగా గూగ్లీ వేస్తే… హుజూరాబాద్ ఎన్నికలో ఆత్మగౌరవ బావుటా ఎగురేసి సిక్సర్ కొట్టారు. అప్పటివరకు కేసీఆర్ ఆడింది పాట, పాడింది పాటగా ఉన్న పరిస్థితులను ఒక్కసారిగా ఈటల చిత్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఏవిధంగానైతే పనిచేశాడో.. దొర దెబ్బతీసిన ఆత్మగౌరవం కోసం హుజూరాబాద్ పల్లెల్లో గళం విప్పి ప్రజల మన్ననలను పొందారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. కేబినెట్ మొత్తం అక్కడే మకాం వేసింది. పార్టీ నేతలందరూ ఇళ్లిళ్లు తిరిగి… ఈటలకు ఓటేయకుండా ప్రజలతో ఓట్టేయించుకున్నారు. ఐతే ఆత్మగౌరవ నినాదం ముందు.. కేసీఆర్ ఆటలు సాగలేదు.
హుజూరాబాద్ దళితులను గులాబీ పార్టీ వైపు తిప్పుకుంటే, ఎన్నికల్లో ఈటలను ఓడించొచ్చన్న పథకం వేసిన కేసీఆర్‌ను నియోజకవర్గంలోని దళితులు చిత్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం హక్కు అని.. పథకాలు మీరిచ్చేదేంటని నినదించారు. ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు తమకు పథకాల ఎర వేశారని గ్రహించారు. కేసీఆర్ నిజ స్వరూపాన్ని హుజూరాబాద్ ప్రజలు బట్టబయలు చేశారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల ఆగడాలకు చెరమగీతం పాడారు. ఎన్నికల్లో ఈటలను ఆశీర్వదించారు. అంతే కాదు భారీ మెజార్టీతో అఖండ విజయాన్ని కట్టబెట్టారు. 52 శాతం ఓట్లతో గులాబీ పార్టీకి చెంప చెల్లుమనిపించారు. తెలంగాణ ప్రజలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే.. వెనకాడబోరని హుజూరాబాద్ చాటి చెప్పింది. పైసలిస్తే ఓట్లేస్తారన్న దురభిప్రాయాన్ని హుజూరాబాద్ తిరస్కరించింది. ఆత్మాభిమానం, అన్యాయం, రాజకీయ కుట్రలను చేధిస్తామని యావత్ తెలంగాణకు హుజూరాబాద్ చాటి చెప్పింది.