Home Page SliderTelangana

దళితబంధు ముసుగు తొలగింది!?

Share with

దళితబంధు అసలు కుట్ర కోణం

హుజూరాబాద్‌లో కారు పార్టీని గెలిపించుకునేందుకు కేసీఆర్ దళితబంధు అంటూ చేసిన ప్రయోగం తెలంగాణ దళితుల మధ్య చిచ్చు రేపింది. పేదల పక్షపాతి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న కీర్తి తనకు రావాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు మాత్రమే దళితబంధు పథకాన్ని తెచ్చారని.. పరిస్థితులు రుజువు చేసాయి. తెలంగాణలో తాను చెప్పింది వేదం, చేసింది శాసనం అన్నట్టుగా వ్యవహరించిన కేసీఆర్‌కు హుజూరాబాద్ ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టడంతో.. భవిష్యత్ ఏంటన్నది అర్థం కాని పరిస్థితుల్లోకి గులాబీదండు చేరుకొంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మంచి, చెడు లెక్కలు వేసుకుంటున్నారని అర్థమయ్యింది. తెలంగాణలో ఇక కేసీఆర్ పప్పులుడకవని రుజువయ్యింది. తెలంగాణలో దళితులందరికీ పథకాన్ని వచ్చే ఐదేళ్లలో అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఏటా పది వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తానంటూ బీరాలు పలికారు. కానీ వాస్తవంలో ఏం జరిగింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, హైదరాబాద్ భూములు అమ్మి మరీ రాజకీయం చేసిన కేసీఆర్, తెలంగాణలోని దళితులందరికీ పది లక్షలు ఇచ్చేదెన్నడో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

దళితబంధుకు బడ్జెట్‌లో నిధులు పెట్టేదెప్పుడు?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 38,476 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని చెబుతున్న ప్రభుత్వం ఒక్క హుజూరాబాద్‌లో 18,211 మందిని గుర్తించామంటోంది. అందరికీ పథకాన్ని అందించామంటోంది. అయితే ఈ చిత్రాలన్నీ తెలియాలంటే హుజూరాబాద్ వెళ్లాల్సిందే. పథకం పంపిణీ చేశామని చెబుతున్న ప్రాంతాల్లో దళితవాడలకు వెళ్లాల్సిందే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 500 మందికి పథకాన్ని అందిస్తున్నామని చెబుతున్నా.. అదంతా పెద్ద తిరకాసు. కేవలం గులాబీ కండువా కప్పుకున్న పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకం చేరింది. ఒక్క హుజూరాబాద్‌లో 18 వేల మందికి పథకం అప్పగిస్తే.. ఇక రాష్ట్రంలోని దళితులు ప్రముఖంగా ఉన్న నియోజకవర్గంలో పథకాన్ని అందించేదెప్పుడో చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా.. ఏటా పది వేల కోట్ల బడ్జెట్ పెట్టేదెన్నడూ.. మిగతా తెలంగాణ ప్రజలకు పథకాన్ని అందించేదెప్పుడు? ఏ పథకం చూసినా ఏమున్నది గర్వకారణమన్న చందంగా కేసీఆర్ వ్యవహరశైలి కన్పిస్తోంది. పచ్చని పల్లెల్లో దళితుల మధ్య దళితబంధు పథకం చిచ్చురేపింది.

దళితబంధు పథకం అమలు చేసే చిత్తు శుద్ధి కేసీఆర్‌కు ఉందా?

మూడేళ్లలో దళితబంధు పథకం రాష్ట్రంలోని దళితులందరికీ చేరుతుందంటూ పథకం ప్రారంభం రోజు కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. దళితులందరికీ పథకాన్ని ఇవ్వాలంటే ఒక అంచనా ప్రకారం 2 లక్షలు కోట్లు అవసరం. కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు కేసీఆర్ లక్షా 70 వేల కోట్లు పథకానికి అవసరమని చెప్పారు. తెలంగాణలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయని నాడు కేసీఆర్ చెప్పారు. కానీ ఆ లెక్కలోనూ తిరకాసు ఉంది. అవన్నీ పక్కనబెడితే… ఇప్పటి వరకు దళితబంధు పథకం పాతిక వేల మందికి మాత్రమే అందిందని ప్రభుత్వం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాగితాలపై ముప్పై ఎనిమిదిన్నర వేలు అంటూ సర్కారు లెక్కలు చెబుతున్నప్పటికీ అదంతా గిమ్మక్కని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, మాదిరిగానే దళితబంధు కూడా ఆరంభ శూరత్వం తప్ప మరేమీ కాదని రుజువవుతోంది. ఏటా 30-40 వేలు కోట్లు కేటాయించుకుంటూ పోతూ రాష్ట్రంలోని దళితులందరికీ మూడేళ్లలో పథకాన్ని అమలు చేస్తామని నాడు హుజూరాబాద్ గడ్డపై కేసీఆర్ ఇచ్చిన హామీ నీటి మీద రాతేనని రుజువయ్యింది.

దళితుల మధ్య చిచ్చు పెట్టిన కేసీఆర్ కుట్ర

కేవలం హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించడానికేనని తేలిపోయింది. పథకం హుజూరాబాద్‌లోనే లోపభుయిష్టంగా అమలైందన్న విమర్శ ఉంది. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితుల్లో అత్యంత వెనుకబాటుకు గురైన కుటుంబాలను 119 నియోజకవర్గాల్లో వంద మందిని లెక్కించి 11,900 మంది అర్హులకు పథకాన్ని అందించాలనుకున్నారు. ఇదంతా కేసీఆర్ ఎన్నికల స్టంట్ అని హుజూరాబాద్‌లో ప్రారంభిస్తే కానీ జనాలకు తెలియలేదు. దళితబంధు రాజకీయ జిమ్మక్కుగా మారి ఆ వర్గంలోని బిడ్డలకు ఆవేదన మిగిల్చింది. ఇన్నాళ్లూ కలిసి ఉన్న దళిత కుటుంబాల్లో చిచ్చు రేపింది. గ్రామాల్లో వివక్షకు, రాజకీయాలకు, కక్షలకు, కార్పణ్యాలకు కారణమైంది.

దళితబంధుతో మిగతా వర్గాల్లో అగ్గి

దళితబంధు పథకాన్ని చిత్తుశుద్ధితో ప్రారంభించి ఉంటే.. తెలంగాణ దళితులు శరవేగంగా అభివృద్ధి చెందేవారు. పథకం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకునేవారు. కానీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి పథకం పెట్టినప్పుడు.. డిమాండ్లు సైతం ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దళితులకు కుటుంబానికి పది లక్షలిచ్చినప్పుడు, మేమేం అన్యాయం చేశామని తెలంగాణ వ్యాప్తంగా గిరిజనులు కేసీఆర్‌ను ప్రశ్నించారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వారికి ముందుకు సర్కారు సంక్షేమం అందాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన బంధు పెట్టాలని ఆందోళనలు, ధర్నాలతో వారు ఆందోళనలు చేశారు. ప్రభుత్వం నిరుపేదల కోసం పనిచేయాలని, అట్టడుగు వర్గాలు మేలు చేయాలనుకున్నప్పుడు తమను ఎందుకు పట్టించుకోదంటూ ప్రశ్నించారు. రాజకీయ వ్యూహంతో దళితబంధు పథకాన్ని మొదలెట్టిన కేసీఆర్, గిరిజిన బంధు డిమాండ్‌తో తలపట్టుకున్నారు. గిరిజనులకు మద్దతుగా బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ సైతం గళం విప్పారు. తెలంగాణ వ్యాప్తంగా గిరిజనలకు పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఇలా ఒక వర్గం తర్వాత మరో వర్గం తమను నిర్లక్ష్యం చేయొద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

బీసీ బంధు అంటూ బడుగుల జంగ్ సైరన్

దళితబంధు పథకాన్ని అరకొర అమలు చేస్తున్నప్పటికీ.. మిగతా వర్గాలు తమను పట్టించుకోవాలంటూ విజ్ఞాపనలు చేసుకున్నాయి. తెలంగాణలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలు తమకు బీసీ బంధు ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. బీసీ బంధు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమంటూ చెప్పిన గులాబీ నేతలు చివరికి ఎన్నికల సమయంలో కొందరికి లక్ష రూపాయల సాయం అందించి.. అదంతా తమ ఘనత అంటూ ప్రకటలు గుప్పించారు. వాస్తవానికి తెలంగాణలో బీసీలు స్వయం సమృద్ధి సాధించాలంటే అది కేవలం ఆర్థిక పరిపుష్ట కలిగించడం వల్లే సాధ్యమవుతుందని ఈటల గత కొంతకాలంగా చెప్తూ వచ్చారు. బీసీ బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి అందించారన్నదానిపైనా క్లారిటీ లేదు. కులవృత్తిదారులకు కేవలం లక్ష మాత్రమే ఇవ్వడమేంటన్న విమర్శ ఉన్నప్పటికీ.. అది కూడా కేవలం ఎన్నికల స్టంట్ గా మార్చిన ఘనత కేసీఆర్‌ది. పథకం అందినవారిలో కూడా అనర్హులే ఎక్కువగా ఉన్నారని వారంతా కూడా పార్టీ కార్యకర్తలేనని విపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. తాజాగా మైనార్టీలకు లక్ష అంటూ మరోసారి వారిని మోసం చేసేందుకు పథక రచన చేస్తున్నారు. తెలంగాణలోని బడుగు, బలహీనవర్గాలను ఓట్ల రూపంలో చూడటం వల్లే అసలు సమస్య ఉత్పన్నమవుతున్నది నిర్వివాదాంశం.