సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు షురూ
సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2026–27 విద్యాసంవత్సరానికి గాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక పోర్టల్ (acad.uohyd.ac.in) ద్వారా జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ విద్యాసంవత్సరంలో మెజారిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను సీయూఈటీ-పీజీ స్కోర్ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. వివిధ కోర్సుల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను పరిశీలిస్తే.. కోర్ పీజీ కోర్సులైన ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంపీఏ, ఎంవీఏ, ఎంబీఏలు మొత్తం కలిపి 1,295 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎంటెక్ (మైక్రోఎలక్ట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్) కోర్సులో 36 సీట్లు, ఎంసీఏలో 40 సీట్లు, అలాగే ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో 29 సీట్లు ఉన్నాయి. మరోవైపు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోఇన్ఫర్మేటిక్స్ వంటి స్పెషలైజ్డ్ టెక్నికల్ కోర్సుల్లోని 100 ఎంటెక్ సీట్లను గేట్ స్కోర్ ఆధారంగా సీసీఎంటీ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ పీజీ ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీయూఈటీ-యూజీ ఫలితాలు విడుదలైన తర్వాత ప్రత్యేకంగా ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. అడ్మిషన్ల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

