Andhra PradeshHome Page Slider

పశ్చిమ ద్వారం కల నెరవేరింది..

గుంటూరు: గుంటూరు రైల్వే స్టేషన్ ప్రస్తుత ప్రధాన ద్వారం తూర్పు టెర్మినల్ జీజీహెచ్ వైపు ఉండడంతో స్టేషన్ ముందు ప్రధాన రహదారి ఇరుకుగా మారింది. నిత్యం వేలమంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ నుంచి ఒక్కసారిగా బయటకు వస్తే ఇరుకు రహదారిలో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రైల్వే స్టేషన్‌కు మరోవైపు రూ.18 కోట్లతో పశ్చిమ టెర్మినల్‌ను సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దయెత్తున రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు శంకర్‌ విలాస్ వంతెన దాటి ట్రాఫిక్‌ జాంతో ఇబ్బందులు పడుతున్నారు. వంతెన దాటకుండా ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా అరండల్‌పేట ఒకటో లైన్ వైపు ఈ పశ్చిమ టెర్మినల్ ద్వారా నేరుగా 8వ నెంబర్ ప్లాట్‌ఫాంలోకి ప్రవేశించవచ్చు. దశాబ్దాల నాటి నగరవాసుల ఈ పశ్చిమ ద్వారం కల నేటికి ఫలించింది. ఈ పశ్చిమ టెర్మినల్ ముందు అందమైన పార్క్, అందులో జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళానృత్యరీతులు, బుద్ధ ప్రతిమ ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫాం రిజర్వేషన్ కౌంటర్లు, ప్యాసింజర్ వెయిటింగ్ హాల్‌లు, అధికారుల కార్యాలయాలు, 2 ఫుడ్‌ప్లాజాల, 12 స్టాళ్లు, ముందువైపు పెద్దపార్కింగ్.. ఇలా అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. ఈ నెలాఖరుకు ఈ ప్రాంగణం జనానికి అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.