Home Page SliderTelangana

సాగునీటి ప్రాజెక్టులు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంలు

Share with

ఒకప్పుడు డబ్బులు ఇచ్చినా.. ఎరువుల కోసం రాత్రింబవళ్లూ క్యూలైన్లలో ఉండాల్సి వచ్చేదని… తెల్లవారు జామున 4 గంటలకే రైతులు వచ్చి చెప్పులు క్యూ పెట్టే వారన్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ రోజు పరిస్థితి మారిందని… రైతులకు సరిపోను ఎరువులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతోందని… యూరియా ఎక్కువ వాడితే.. భూమి దెబ్బతింటుందని భావించి నీమ్​కోటెడ్​ యూరియాను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. 250 రూపాయలు ఒక బస్తాకు రైతు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 వేల వరకు సబ్సిడీ భరిస్తోందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జి. కిషన్​ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయని, వ్యవసాయ, పారిశ్రామిక, ఉత్పత్తి, విదేవీ విధానం, దేశంలో మౌలిక వసుతుల కల్పన లాంటి అనేక అంశాల్లో గత తొమ్మిదేండ్లుగా జరిగిన అభివృద్ధిని మనం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు కిషన్ రెడ్డి.

ఎకరానికి ఒక ఏడాదికి మోదీ ప్రభుత్వం 20 వేల రూపాయల సబ్సిడీ అందిస్తోందన్నారు. రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారని, ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రామగుండం వస్తే.. మన ముఖ్యమంత్రి ఫామ్‌హౌజ్‌లో పండుకున్నారన్నారు. మోదీ ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వస్తే.. కేసీఆర్​ ప్రగతిభవన్​లో ఉన్నారన్నారు. తన కొడుకును ఎలా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన తప్ప.. తెలంగాణ అభివృద్ధి మీద కేసీఆర్​‌కు చిత్తశుద్ధి లేదన్నారు. వ్యవసాయం బాగుపడాలంటే.. సాగునీరు రావాలన్నారు. కేసీఆర్​ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్​ పేరుతో.. 30 వేల కోట్ల బడ్జెట్ లక్షా 50 వేల కోట్లకు తీసుకువెళ్లారన్నారు. అంత చేస్తే.. ఆ ప్రాజెక్టుకు ఫీసిబిలిటి లేదని, కరెంట్​ బిల్లులు కట్టలేని పరిస్థితని… వచ్చే నీళ్లకు, పండే పంటకు పొంతన లేదు. స్వయంగా ముఖ్యమంత్రే ఫామ్‌హౌజ్‌​ ఇంజనీర్‌​గా మారి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను ముంచారన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 20 వేల కోట్లతో బడ్జెట్​ ప్రతిపాదనలతో ఉన్న ప్రాజెక్టును.. 57 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. ఒక్క పంపు హౌజ్ ప్రారంభించి ఎన్నికల ముందు పాలమూరుకు మొత్తం నీళ్లు ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ సుప్రీం కోర్టుకు వెళ్లిందని. కేసు విత్​ డ్రా చేసుకోమని కేంద్రం చెబితే.. ఏండ్ల తరబడి కేసీఆర్ జాప్యం చేశారన్నారు. ఆయన వల్లే కృష్ణా వాటర్​ డిస్ప్యూట్​ ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగిందని విమర్శించారు. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, మెదక్​, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం కావాలంటే నదుల అనుసంధానం కావాలని… ఏటా గోదావరి నీళ్లు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్​ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని, అందుకే కేసీఆ‌ర్‌​కు నదుల అనుసంధానం ఇష్టం లేదన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణకు పూర్తి విరుద్ధంగా కేసీఆర్ పనిచేస్తున్నారనిదుయ్యబట్టారు.