నాటో విస్తరణపై పుతిన్ ఆగ్రహం
తమ దేశ భద్రతకు విఘాతం కలిగించే ఏ ప్రతిపాదనను తాము సమ్మతించేది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రష్యా భద్రతను బలి చేయడం ఎన్నటీకీ తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. భారత్ లో పర్యటిస్తున్న వేళ ఆయన జాతీయ మీడియాతో సమావేశం నిర్వహించారు. ‘‘జెలెన్‌స్కీ అధికారంలోకి వచ్చినప్పుడు శాంతి వాగ్దానాలు చేశారు. ఆ తర్వాత ఆయన విధానం మారిపోయింది. ప్రజల ప్రయోజనాల కంటే కొద్దిమంది అతివాదుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని పుతిన్ మండిపడ్డారు. ఈ వైఖరిని ‘నయా నాజీ పాలన’తో పోల్చారు. శాంతియుత చర్చలకు బదులు సైనిక పరిష్కారాలకే ఉక్రెయిన్ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పుకొచ్చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ విషయంలో రష్యా భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిందని స్పష్టం చేశారు. జెలెన్‌స్కీ మొదట శాంతి వాగ్దానాలు చేసినప్పటికీ తరువాత ఆయన విధానం మారిపోయిందని, కొద్దిమంది అతివాదుల ప్రభావంలోకి వెళ్లిపోయారని పుతిన్ తీవ్రంగా విమర్శించారు. ఈ వైఖరిని నయా నాజీ పాలనతో పోలుస్తూ, శాంతి చర్చలకంటే సైనిక పరిష్కారాలకే ఉక్రెయిన్ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అసలు సమస్య నాటో తూర్పు వైపు విస్తరణే అని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సహా ప్రతి దేశానికి తన రక్షణ కోసం మార్గం ఎంచుకునే స్వతంత్ర హక్కు ఉన్నప్పటికీ, అది ఇతర దేశాలకు హాని చేయకుండా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
నాటోను తూర్పు వైపు విస్తరించబోమన్న హామీ ఇచ్చినా పాశ్చాత్య దేశాలు అనేకసార్లు దానిని ఉల్లంఘించాయని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలోకి తీసుకురావడం రష్యా భద్రతకు ముప్పు అని స్పష్టం చేస్తూ, అలాంటి పరిస్థితిని రష్యా సహించదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని పుతిన్ అభిప్రాయపడ్డారు. నష్టాలను తగ్గించాలని ట్రంప్ కోరుకుంటున్నారని, ఆయన ఉద్దేశాలు నిజాయతీగానే ఉన్నాయని అన్నారు. అయితే రష్యా చర్చలకు సిద్ధంగానే ఉన్నప్పటికీ, తమ భద్రతకు విఘాతం కలిగించే షరతులను ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ మొదటి రాజ్యాంగంలో తటస్థ విధానం పేర్కొన్నప్పటికీ, తరువాత అక్కడి పాలకులు దానిని విస్మరించారని పుతిన్ విమర్శించారు. జీ-7 కూటమిలో రష్యా చేరబోదని ఆయన స్పష్టం చేశారు. గతంలో జీ-8లో భాగమై ఉన్నప్పటికీ, తన హాజరు లేకపోవడంతో మళ్లీ జీ-7గా మారిందని గుర్తుచేశారు. కొనుగోలు శక్తి పరంగా జీ-7 దేశాల బలం తగ్గిపోతోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో అతిపెద్ద దేశంగా ఎదుగుతోందని పుతిన్ పేర్కొన్నారు. ఐరోపా పెద్ద దేశాలు మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయని చురక అంటిస్తూ, రష్యా జీ-7 కంటే ఇతర అంతర్జాతీయ కూటములకు ప్రాధాన్యం ఇస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.

