Breaking Newshome page sliderHome Page Slidertelangana,

మన సీఎం ఒక బినామీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక “బినామీ ముఖ్యమంత్రి” మాత్రమేనని, ఆయన వెనుక ఉండి నడిపించే శక్తులు వేరే ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, KLSR ఇన్ఫ్రా టెక్ కంపెనీ వ్యవహారంలో భారీ అవకతవకలు జరిగాయని, దీనిపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

2023లోనే దివాళా తీసి, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న KLSR కంపెనీకి ప్రభుత్వం రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఎలా కట్టబెట్టిందని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వాడుతున్న సొంత కారు కూడా అదే కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం వారి మధ్య ఉన్న సంబంధాలకు నిదర్శనమని ఆరోపించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్ వంటి కీలక ప్రాజెక్టుల టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు అప్పగించారని ఆయన ధ్వజమెత్తారు.

ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ విచారణ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ‘ఫోన్ ట్యాపింగ్’ కేసును తెరపైకి తెచ్చిందని ఆయన విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ , ఈడీ లేదా ఎస్.ఎఫ్.ఐ.ఓ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తాము ఆధారాలతో సహా ఈ విషయాలను బయటపెడుతున్నామని, కేంద్రం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.