‘యుద్ధానికి మీరే కారణం’..జెలెన్‌స్కీపై ట్రంప్ ఆరోపణలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి కారణం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీనే అన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమయ్యింది. ఆయన ఫ్లోరిడాలోని తన భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సంచలన ఆరోపణలు చేశారు. యుద్ధం మొదలుకావడానికి ముందే జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శాంతి చర్చలు చేసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సౌదీలో శాంతి చర్చల కోసం జెలెన్‌స్కీని ఆహ్వానించలేదనే ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. “అసలు యుద్ధాన్ని మొదలుపెట్టి ఉండాల్సింది కాదు. మూడేళ్లుగా ఎందుకు యుద్ధం చేస్తున్నారు. డీల్ ఎందుకు మాట్లాడుకోలేదు?” అంటూ విమర్శలు కురిపించారు. “నేను ఉక్రెయిన్ కోసం అది పోగొట్టుకున్న భూమిని మొత్తం ఇప్పించగలను. ఏ నగరం నేలమట్టం కాదు. కానీ జెలెన్‌స్కీకి అది అక్కరలేదు. అసలు ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించాలి. జెలెన్‌స్కీకి 4 శాతం మాత్రమే ప్రజల మద్దతు ఉంది”. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.