NationalNews

ములాయం ఆరోగ్యం అత్యంత విషమం

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. అనారోగ్యం కారణంగా ఆగస్టు 22వ తేదీ నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 82 ఏళ్ల ములాయంకు ఆంకాలజిస్టులు డాక్టర్‌ నితిన్‌ సూద్‌, డాక్టర్‌ సుశీల్‌ కటారియాలు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం రాత్రి ఐసీయూకు తరలించారు. ములాయం తనయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

శరీరమంతా పాకిన ఇన్ఫెక్షన్‌..

మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ములాయంకు వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తోడయ్యాయని డాక్టర్లు చెప్పారు. ఇన్ఫెక్షన్‌ శరీరమంతా పాకిందని, ఆక్సిజన్‌ లెవల్స్‌ కూడా తగ్గాయని తెలిపారు. ములాయం ఆరోగ్యంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. అఖిలేశ్‌కు ఫోన్‌ చేసిన కేసీఆర్ వెటరన్‌ నాయకుడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత వచ్చి కలుస్తానన్నారు. మూడుసార్లు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా సేవలందించిన ములాయం కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కరోనా బారిన పడినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తదితరులు కూడా అఖిలేశ్కు‌ ఫొన్‌ చేసి ములాయం ఆరోగ్యం గురించి ఆరా తీశారు.