NewsTelangana

రంగంలోకి రాజేందర్… అమిత్ షా మాస్టర్ స్ట్రాటజీ

Share with

బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా ఏం చేసినా అందుకు లెక్కలుంటాయ్. ఆయన తీసుకున్న ఏ నిర్ణయమైనా వందకు వంద శాతం విజయవంతమవుతుంది. ఆయన గురి చూసి కొట్టారంటే గోల్ రీచ్ అవ్వాల్సిందే. 2014 తర్వాత అమిత్ షా వ్యూహాలన్నీ విజయవంతమయ్యాయ్. తాజాగా ఇప్పుడు షా… తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా… బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. అందుకు తగిన కార్యాచరణను పార్టీ సిద్ధం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటై ఎనిమిదేళ్లయినా ఆకాంక్షలు నెరవేరలేదన్న భావనలో ప్రజలున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే అందుకు వ్యూహం కావాలి. పార్టీని పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధం చేయాలి. తెలంగాణలో పార్టీ విజయం సాధించడమంటే ఆషామాషీ కాదని బీజేపీ నాయకత్వానికి బాగా తెలుసు.

గత నెల రోజులుగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై అటు ఆర్ఎస్ఎస్ వ్యూహకర్తలు, ఇటు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ ను ఢీకొట్టి నిలబడే సత్తా ఉన్న నేత కోసం అన్వేషణ చేస్తున్న పార్టీ నేతలకు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కన్పించారు. కేసీఆర్ ఆనుపానులు తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ బీసీ నాయకుడిగా.. రాజేందర్‌కు ఉన్న ఇమేజ్ వచ్చే ఎన్నికల్లో పార్టీకి మైలేజ్ తెస్తోందన్న భావనకు పార్టీ వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకు హోం మంత్రి అమిత్ షా రాజేందర్ ను ఢిల్లీ పిలిపించి తెలంగాణ వ్యూహంపై చర్చించారు. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం… తెలంగాణలో గెలవడం ఎలా అన్నదానిపై పార్టీ ఇప్పుడు ఫుల్ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు ఈటల రాజేందర్ ను ఢిల్లీ పిలిపించుకొని మరీ అమిత్ షా చర్చలు జరిపారు. ఇప్పటి వరకు మాటలతో కాలం గడిపేశామని… ఇకపై అసలు సిసలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు ఈటలకు షా వివరించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా… ఈటలకు… అందుకు తగిన కీలక పదవిని సైతం ఆఫర్ చేసినట్టు సమాచారం.