గొటబాయి శ్రీలంకకు వస్తే విచారణ ఖాయమే
గొటబాయి రాజపక్స శ్రీలంకకు తిరిగి వస్తే..ఎట్టి పరిస్థితులలో ఆయన విచారణను ఎదుర్కొవాల్సిందేనని శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగయ డిమాండ్ చేసింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరూకుపోవడానికి ప్రధాన కారణం గొటబాయేనని ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దేశాభివృద్దికి వినియోగించాల్సిన నిధులను ఆయన తన కుటుంబ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో నిధుల దుర్వినియోగం చేసినందుకు గాను ఆయన తప్పకుండా ఈ విచారణకు హాజరు కావాల్సివుంది. ప్రస్తుతం ఆయన తన పదవికి రాజీనామా చేసిన కారణంగా ఆయనకు చట్టపరమైన మినహాయింపులు ఏమి లేవని అక్కడి ప్రతిపక్షాలు గుర్తుచేశాయి.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి ముఖ్య కారణంగా ఉన్నందుకు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో ఆయన ఆ దేశాన్ని విడిచి విదేశాలకు పరారయ్యి ప్రస్తుతం బ్యాంకాక్‌లోని ఒక హోటల్‌లో ఉంటున్నారు. అయితే ఆయన మళ్ళీ శ్రీలంకకు ఈ వారం తిరిగి రానున్నారని గొటబాయి బంధువు ఒకరు తాజాగా ప్రకటించారు. గొటబాయి శ్రీలంక పౌరుడు కాబట్టి ఆయన ఎప్పుడైన తన మాతృభూమికి తిరిగి వచ్చే హక్కు ఉందని దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఆయన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలలో భాగంగా విచారణ ఎదుర్కొవాల్సివుంది. అంతేకాకుండా తన తల్లిదండ్రుల స్మారక చిహ్నం కోసం రాష్ట్ర నిధులు ఖర్చు చేసినట్లుగా ఆయనపై కేసు కూడా ఉంది. రాజ్యాంగపరంగా ప్రస్తుతం ఆయనకు చట్టపరమైన మినహాయింపులు ఏవీ వర్తించవు. కాబట్టి ఆయనను విచారించవచ్చని ఈ క్రమంలో ఆయన దోషిగా తేలితే జరిమానా కూడా విధించవచ్చని ఎస్‌జేబి నేత అజిత్ పి పెరీరా వెల్లడించినట్లు ఓ వార్తా పత్రిక తెలిపింది. అంతేకాకుండా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అందించిన ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని కూడా గొటబాయి ప్రబుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన పేర్కొన్నారు. గొటబాయిపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

