ఇజ్రాయెల్‌లో భారతీయుల అత్యవసర తరలింపు…ఆపరేషన్ అజయ్
భయంకర యుద్ధపరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయెల్‌లోని భారతీయులను భారత్‌కు అత్యవసరంగా తరలించే ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం. దీనికి ఆపరేషన్ అజయ్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని శ్రీలంక పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. విదేశాలలోని భారతీయుల భద్రత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేడు (గురువారం) భారతీయులతో కూడిన మొదటి విమానం భారత్‌కు చేరుకుంటుందని తెలియజేశారు. ప్రత్యేక విమానాలలో భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముంబైలోని ఇజ్రాయెన్ కాన్సుల్ లెక్క ప్రకారం ఇజ్రాయెల్‌లో 20 వేలమందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. తమ రాష్ట్రానికి చెందిన వారు ఏడువేల మంది ఇజ్రాయెల్‌లో ఉన్నారని, కేరళ సీఎం పినరయి విజయన్ ఇప్పటికే విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. తమిళనాడు ప్రజలు 80 మంది ఉన్నారని సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని సురక్షితంగా తీసుకురావాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంలో భారతీయులను తరలించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో 24 గంటలూ రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది.