Andhra PradeshHome Page Slider

కొవ్వు కేకలు పనిచేయలేదు… 4 రోజుల్లో లడ్డూల రికార్డ్ సేల్స్

జంతువుల కొవ్వు వ్యాఖ్యలు, తిరుమల కొండల్లో కలకలం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారి లడ్డూ ప్రసాదం సేల్స్ అమవుతాయోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. కానీ శ్రీవారి లడ్డూ ప్రసాదం సేల్స్ రికార్డు బద్ధలుకొట్టాయ్. 4 రోజుల్లో 14 లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ చెబుతోంది. తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌లో భారీ రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే ప్రతిరోజూ 60,000 మంది యాత్రికులు స్వామిని దర్శించుకుంటారు. అదే సమయంలో స్వామి లడ్డూ ప్రసాదం అమ్మకాలు దెబ్బతినలేదు. నాలుగు రోజుల్లో 14 లక్షలకు పైగా తిరుపతి లడ్డూలు అమ్ముడుపోయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 19న మొత్తం 3.59 లక్షల లడ్డూలు, సెప్టెంబర్ 20న 3.17 లక్షలు, సెప్టెంబర్ 21న 3.67 లక్షలు, సెప్టెంబర్ 22న 3.60 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయని వివరించారు. అమ్మకాల గణాంకాల సగటు, రోజుకు మూడున్నర లక్షలు చేరాయి.

దీనిపై భక్తులను మనసర్కార్ మీడియా ప్రశ్నించగా.. ‘‘మా విశ్వాసం నాలుగు మాటలతో చెదిరేది కాదు. స్వామిపై మా భక్తి అచంచలమైనది’’ అని వెంకటేశ్వరరావు సమాధానమిచ్చారు. తిరుపతి లడ్డూలపై ప్రచారాన్ని పట్టించుకోనక్కర్లేదని చాలా మంది భక్తులు మన సర్కార్ కు వివరించారు. చెన్నై నుంచి వచ్చిన భక్తుడు తాను స్వామి ప్రసాదం 20 ఏళ్లుగా తీసుకెళ్తున్నానని, ముందు తనకు ఎలాంటి విశ్వాసం ఉందో ఇప్పుడు కూడా ఇలాగే ఉందని చెప్పాడు. మరో ఉత్తరాది భక్తుడు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్వామి ప్రసాదాన్ని వివాదం చేయొద్దన్నాడు. ఆలయంలో ప్రతిరోజూ 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తారు. ఆలయాన్ని సందర్శించే యాత్రికులు పెద్ద సంఖ్యలో వాటిని కొనుగోలు చేస్తారు. తరచుగా స్నేహితులు, బంధువులకు ఇవ్వడానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఒక జ్ఞాపకంగా హిందూ భక్తజనం భావిస్తుంది. తిరుపతి లడ్డూల తయారీ కోసం వెరుశనగపప్పు, ఆవు నెయ్యి, పంచదార, జీడిపప్పు, యాలకల, ఎండుద్రాక్ష, బాదం పప్పులు వినియోగిస్తారు. లడ్డూల తయారీకి ప్రతిరోజూ 15,000 కిలోల ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు.

గత వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆరోపించిన నేపథ్యంలో తిరుపతి దేవస్థానం పెద్ద దుమారాన్ని రేపుతోంది. దీనిపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు మొత్తం రచ్చపై విచారణ సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరగాలన్న డిమాండ్ కూడా భక్తుల నుంచి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి తర్వాత, తనను, వైసీపీని అప్రతిష్టపాల్జేసేందుకు టీడీపీ మతపరమైన అంశాన్ని రాజకీయం చేస్తోందని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. “టెండర్ ప్రక్రియ ప్రతి ఆరు నెలలకు జరుగుతుంది. అర్హత ప్రమాణాలు దశాబ్దాలుగా మారవు. సరఫరాదారులు తప్పనిసరిగా NABL సర్టిఫికేట్, ఉత్పత్తి నాణ్యత సర్టిఫికేట్ అందించాలి. TTD నెయ్యి నమూనాలను సేకరిస్తుంది. ధృవీకరణ పొందిన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తుంది. కానీ చంద్రబాబు మతపరమైన విషయాలను రాజకీయం చేస్తున్నారు,” అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలకోరని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.