మారింది చంద్రబాబు కాదు… నారా లోకేష్
◆ గతానికి భిన్నంగా పర్యటనలు, ప్రసంగాలు
◆ రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు
◆ మహానాడు సక్సెస్ కావటంలో కీలకపాత్ర
ఏపీలో రాబోయే ఎన్నికలలో టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యతను తన భుజాలపై పెట్టుకుంటున్నారట నారా లోకేష్. తండ్రికి తగ్గ తనయుడిగా భవిష్యత్తులో టీడీపీ వారసుడుగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారు. తన సమర్ధతనే ప్రశ్నిస్తున్న ప్రత్యర్ధి పార్టీలకు ఊహకందని షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దానిలో భాగంగానే టీడీపీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన వారి మీద ఏమైనా కేసులు పెట్టిన ఏదైనా ఇబ్బందులకు గురిచేసిన వెంటనే నారా లోకేష్ అక్కడికి వెళ్లి వారిలో ధైర్యాన్ని నింపి తనదైన శైలిలో అధికారపక్షంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. 2014లో అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం, 2019 ఘోర ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. ఇప్పటికీ కేసుల భయంతో క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు ఆత్మస్థైర్థాన్ని కోల్పోతున్నాయి. ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణుల పరిస్థితి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా తయారైంది. అప్పటి నుండి పార్టీ పరంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా అటు నాయకుల నుండి కాని ఇటు కార్యకర్తల వైపు నుండి కానీ పెద్దగా స్పందన కూడా ఉండేది కాదు. స్వయానా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకున్నవారు లేరనే చెప్పాలి.
కానీ మే నెలలో ఒంగోలులో నిర్వహించిన మహానాడు ఊహించని రీతిలో విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేసింది. టీడీపీకి పూర్వవైభవం తీసుకు రావచ్చు అనే ఆశ అటు పార్టీ శ్రేణుల నుండి అధినేత వరకు వచ్చాయి. మహానాడు ఊహించిన దానికంటే సక్సెస్ కావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని సమాచారం.అదే ఉత్సాహంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కొన్ని మార్పులు చేయాలని పార్టీలోకి కొత్త రక్తాన్ని తేవాలని మార్పును తన వద్దే మొదలుపెడతానంటూ నారా లోకేష్ సంచలన కామెంట్స్ కూడా చేశారు. వీటిలో ప్రధానంగా ఎంతటి వారికైనా రెండు సార్లు వరుస ఓటమి చెందితే పార్టీ టికెట్ ఉండదని తేల్చేశారు. ఎవరికైనా పార్టీలో జోడు పదవులు ఉండరాదని, ఒక పదవిలో రెండుసార్లు కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని అందరికి ఆదర్శంగా త్వరలో తానుకూడా పార్టీ ప్రదాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
అంతేకాదు పార్టీ యువతకు ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మహానాడు సభసాక్షిగా ప్రకటించారు. పార్టీ కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధం అంటూ ప్రకటించారు. వేదిక మీద ప్రగల్భాలైతే పలికారు గానీ ఇప్పటికీ మహానాడు ముగిసి రెండు నెలలు పైనే కావస్తున్నా ఆచరణలో మాత్రం ఆరంభ శూరత్వమే కనిపిస్తోంది. ఇప్పటికి చాలా నియోజకవర్గాలలో కనీసం పార్టీ ఇన్ఛార్జ్ లను కూడా నియమించకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ఊహగానాల నేపథ్యంలో ఇంత వరకు పార్టీ పరంగా ఏవిధమైనా చర్యలూ చేపట్టకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుండి ప్రజల్లో ఉంటే తప్ప ఎన్నికల నాటికి పార్టీకి జవసత్వాలు కూడబెట్టడం కష్టమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి నారా లోకేష్ తన వ్యూహాలకు పదును పెట్టి మహానాడులో చెప్పిన మాటలను ఆచరిస్తారా పార్టీకి జవ సత్వాలు నింపి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.