ఇకనుంచి “రాత్రీపగలు” పతాక రెపరెపలు..!
జాతీయజెండా నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కేంద్రం..
దశాబ్దాలుగా కొనసాగుతున్న జాతీయజెండా నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో సాయంత్రానికల్లా పతాకాన్ని అవనతం చేసేవారు. ఇక నుంచీ రేయింబవళ్లు త్రివర్ణ పతాకం రెపరెపలు కొనసాగేలా ఫ్లాగ్ కోడ్‌లో మార్పు చేశారు. అలాగే ఇదివరకు యంత్రంతో రూపొందించిన జెండాలు, పాలిస్టర్ పతాకాల వినియోగంపై నిషేధం ఉండేది. ఇపుడు ఆ నిబంధనలను కూడా సడలించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 మధ్య ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రతి ఇంటి మీద జాతీయజెండా ఎగరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లాగ్ కోడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా కేంద్ర మంత్రుల కార్యాలయాలు, ఆయా విభాగాలకు పంపిన లేఖలో ఈ విషయాలు వివరించారు. చేతితో నేసిన, యంత్రాలతో రూపొందించిన కాటన్, పాలిస్టర్, ఉన్ని, సిల్కు జెండాలను ఉపయోగించేందుకు అనుమతించారు.