స్వేచ్ఛావాయులు అందించిన అమృతఘట్టానికి 75 ఏళ్లు
పుణ్య కార్యఫలాలు అందిన రోజు.
స్వేచ్ఛా వాయువులు రివ్వున వీచిన రోజు
దేశభక్తి భావాలు వెలిగిన రోజు.
ప్రతి మోములో అనందం అంబరమై వికసించిన రోజు.
దేశం మొత్తం జైహింద్ అని నినదించిన రోజు.
అందుకే ఇది పరమ పవిత్రమైన రోజు..
భారత్ లో పండుగ రోజు.
వాడవాడలా సంబరాలు జరిగే రోజు.
గతంలో కంటే భిన్నమైన రోజు. కారణం ఏంటి ?
ఈసారి ఎందుకింత ప్రత్యేకం ?
దేశవ్యాప్తంగా నిరంతర కార్యక్రమాల నిర్వహణకు కారణమేంటి?
అసలు ఆగస్ట్ 15న ఢిల్లీ లో ఏం జరగబోతోంది?
ఆగస్ట్ 15. అత్యంత విశిష్టమైన రోజు.. పవిత్రమైన రోజు.. అలాగే అందరికీ పండుగ రోజు. భారతమాత శిరసెత్తి నిలబడినట్టు.. నిండైన రూపంతో అందరికీ దర్శనమిచ్చినట్టు వాడవాడలా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడతాయి. ప్రతి ఒక్కరి గుండెలపై జాతీయ కేతనాలు చిరు దరహాసాలు చేస్తాయి. దేశ భక్తి గీతాల పరవళ్ళ మధ్య, సైనిక సెల్యూట్లతో భారత్ ప్రగతి శకటాల రూపంలో కళ్ళ ముందు తొణికిసలాడతాయి. ఓ దేవాలయంలో ప్రతిష్టతమైన దేవతా మూర్తిలా ఎర్రకోటపై త్రివర్ణ కేతనం దివ్యంగా భాసిల్లుతుంది. మిలటరీ బ్యాండ్ శ్రావ్యగానం చేస్తుంటే.. ఢిల్లీ పురవీధుల్లో భారత్ మాతాకీ జై అన్న నినాద హోరు మిన్ను ముడుతుంది. ప్రతి ఏడాది ఇదంతా ఒకేలా జరుగుతుంది. కానీ ఈసారి వేరు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ్ పేరిట ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి ఢిల్లీలో కూడా భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రాలు కూడా కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి.
ప్రధాన వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద ఇప్పటికే భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 15వ తేదీ ఉదయం ఎర్రకోట దగ్గర జరిగే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ప్రధాని అక్కడకు చేరుకోగానే కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాధ్ సింగ్,తో పాటు సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ లు ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలతో పాటు ఢిల్లీ పోలీసుల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరిస్తారు. ఆ తర్వాత ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి చారిత్రక ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే .. తొలిసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు MI17 హెలికాప్టర్లు పుష్పవృష్టిని కురించనున్నాయి. అనంతరం ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ విద్యా సంస్ధలకు చెందిన దాదాపు 500 మంది NCC విద్యార్ధులు జాతీయ గీతాలాపన చేస్తారు. ఎప్పటి లాగా అధికారులు, మంత్రులు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఎర్రకోట దక్షిణ భాగంలో కరోనా ఫ్రంట్ లైన్ యోధుల కోసం ప్రత్యేకంగా ఓ గ్యాలరీ ఏర్పాటు చేశారు. భారత్ ప్రతిష్టను ఇనుమడింప చేసిన 32 మంది ఒలింపిక్స్ విజేతలతో పాటు ఇతర శాయ్ అధికారులను ఆహ్వానించారు. ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాను ప్రత్యేకంగా ఆహ్వనించారు. అలాగే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడా బృందాన్ని కూడా ఆహ్వానించారు.
రెండు శతాబ్దాల పాటు బ్రిటీష్ ముష్కరుల పాలనలో మగ్గిన దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు అనేక మంది వీరత్వాన్ని ప్రదర్శించి ప్రాణ త్యాగాలను కూడా చేశారు. వారి త్యాగ ఫలంతో 75 సంవత్సరాల క్రితం భారత్ స్వాతంత్య్రాన్ని సముపార్జించుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడు దేశమంతటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక కళా ప్రదర్శనలతో పాటు .. ర్యాలీలు నిర్వహించారు. ఇక ఈ అమృతోత్సవాల సందర్భంగా పంద్రాగస్ట్ నాడు దేశ ప్రజలందరూ వారి వారి నివాసాలపై జాతీయ పతాకాలను ఎగుర వేయాలని ప్రధాని పిలుపు నిచ్చారు. కాగా.. తెలంగాణతో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో అతి పెద్ద జాతీయ పతాకాలను ఎగుర వేసి .. స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడకక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని .. వారి నుండి కొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.