ఆగస్టు 1 నుండి 2.68 కోట్ల మందికి PMGKAY ఉచిత బియ్యం పంపిణీ
ఆగస్టు 1 నుండి ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ అన్నయోజన పథకం క్రింద ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలోని 2.68 కోట్ల మంది నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు బొత్స. ఈ పథకం క్రింద రాష్ట్రంలోని 2.68 కోట్లు మంది నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీచేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం ఏప్రిల్ 2020 నుండి మార్చి 2022 వరకూ రాష్ట్రంలో కొనసాగించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అర్హులు అందరికీ పిఎంజికెఎవై పథకాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి లేఖ రాశారన్నారు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు.