Home Page SliderNationalPolitics

బెంగాల్ బూత్ సమీపంలో బాంబు పేలుడు

పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని నవోదా ప్రాంతంలో గల ఒక పోలింగ్ బూత్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి నాటు బాంబుతో దాడికి పాల్పడ్డాడు. ఈ హఠాత్ పరిణామంతో ఓటర్లు ప్రాణభయంతో పరుగులు తీయగా, పలువురు ఈ ఘటనలో గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలింగ్‌కు ఆటంకం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం తొలి దశలో 16 జిల్లాల్లోని 152 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1,478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మిగిలిన 142 స్థానాలకు వచ్చే వారం ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్, ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఈ ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్న తరుణంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు జరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.