డీకే శివకుమార్ భారీ వ్యూహం
కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, త్వరలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న డీకే శివకుమార్ రాష్ట్ర ప్రజల కోసం ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా 10 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, ఆయన సరికొత్త పూర్తిస్థాయి బజెట్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 4.48 లక్షల కోట్ల బజెట్‌నే కొనసాగిస్తూ.. కేవలం కొన్ని అనుబంధ బజెట్ మార్పుల ద్వారా తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
కొత్త బజెట్ లేకపోయినప్పటికీ, సమాజంలోని పెద్ద వర్గాలకు తక్షణ ప్రయోజనం చేకూర్చేలా డీకే శివకుమార్ రెండు ప్రధాన ప్రతిష్టాత్మక పథకాలను ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అత్యాధునిక, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా ఒక ప్రత్యేక హెల్త్ కేర్ ప్రాజెక్ట్‌ను డీకే శివకుమార్ తీసుకురానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, విద్యార్థుల చేరికను పెంచేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సుమారు 10,000 పాఠశాలలను పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ సంస్థల చేత దత్తత ఇప్పించేలా కొత్త పాలసీని రూపొందిస్తున్నారు.
కొత్తగా పన్నులు విధించకుండా కేవలం ఆదాయ వనరుల సమీకరణ మరియు బెంగళూరు నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని డీకే భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు ఆయన సీఎం బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.

