Home Page SliderNationalNews AlertSports

రికార్డుల వేటలో వైభవ్ సూర్యవంశీ!

ఐపీఎల్-2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను వణికించాడు. ఈ క్రమంలో వైభవ్ పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు, మరికొన్నింటికి చేరువయ్యాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు వైభవ్ కేవలం ఒకే ఒక్క సిక్సర్ దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్ (843 బంతులు) పేరిట ఉంది. వైభవ్ ఇప్పటివరకు కేవలం 511 బంతుల్లోనే 99 సిక్సర్లు బాదడం విశేషం. మే 1న జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో వైభవ్ మరో సిక్సర్ కొడితే, పొలార్డ్ రికార్డును భారీ వ్యత్యాసంతో బద్దలు కొడతాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే వైభవ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వైభవ్ ఈ ఫీట్‌ను కేవలం 167 బంతుల్లో సాధించడం గమనార్హం. అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వంటి స్టార్ బౌలర్లను సైతం లెక్కచేయకుండా ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, తన హిట్టింగ్‌తో ప్రత్యర్థి జట్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు. తదుపరి మ్యాచ్‌లో వైభవ్ తన పేరిట ప్రపంచ రికార్డును లిఖించుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.