బాల్క సుమన్ విడుదల
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 14 రోజుల రిమాండ్ తర్వాత బుధవారం ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఆయనతో పాటు మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ ముల రాజారెడ్డి, మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్, నాయకుడు లక్ష్మీకాంత్ కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. వీరికి మాజీ మంత్రి జోగు రామన్న , చెన్నూర్ నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు జైలు వద్ద టపాసులు కాల్చి, నినాదాలతో ఘన స్వాగతం పలికారు. తర్వాత వందలాది వాహనాల శ్రేణితో బాల్క సుమన్ క్యాతనపల్లికి బయలుదేరారు.

జైలు విడుదల తర్వాత తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ ప్రభుత్వం,అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్, డీసీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ కాంగ్రెస్ కార్యకర్తల్లా, విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ అరాచకాలకు పాల్పడ్డారని, ఆత్మరక్షణ కోసం ప్రయత్నించిన తమపై అక్రమంగా కేసులు పెట్టించి జైలుకు పంపారని ఆరోపించారు. జైలులో తనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా, ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమను ఇబ్బంది పెడుతున్నారని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని సుమన్ డిమాండ్ చేశారు. ఘర్షణకు కారణమైన కాంగ్రెస్ నేతలపై కూడా కేసులు పెట్టాలని, ప్రజాతీర్పును సీఎం రేవంత్ రెడ్డి గౌరవించాలని హితవు పలికారు.

