crimeHome Page SliderNationalviral

భర్త హత్యకు 20 లక్షల సుపారీ ఇచ్చిన భార్య

మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్‌ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తొలుత రూ.4 లక్షలు ఆఫర్‌ చేయగా, తర్వాత దాన్ని రూ.20 లక్షలకు పెంచినట్టు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ, సోనమ్‌ మేఘాలయలో అదృశ్యమైన విషయం తెలిసిందే. రఘువంశీని భార్యనే హత్య చేయించిందని పోలీసులు నిర్ధారించారు.

హత్యకు ప్లాన్‌ ఇలా..

మధ్యప్రదేశ్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేసే రాజా రఘువంశీని సోనమ్‌ మే 11న వివాహం చేసుకుంది. అయితే ఆమె ప్రియుడు రాజ్‌ కుష్వాహా ఆమె తండ్రి వద్ద పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే సోనమ్‌ కన్నా కుష్వాహా ఐదేండ్లు చిన్నవాడు. దీంతో అతడితో పెండ్లి అంటే తన తండ్రి ఒప్పుకోడని సోనమ్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ముందుగా రఘువంశీని పెండ్లి చేసుకుని అతడిని చంపేస్తే తాను విధవగా మారుతానని, అప్పుడు కుష్వాహాతో వివాహానికి తండ్రి అంగీకరిస్తాడని భావించింది. ‘ముందు మనం రాజాను చంపేద్దాం. తర్వాత దానిని దోపిడీగా చిత్రీకరిద్దాం.

నేను విధవను అయిన తర్వాత మా నాన్న మన పెండ్లికి తప్పక అంగీకరిస్తాడు’ అని ప్రియునికి నచ్చజెప్పింది. ఈ మేరకు భర్తను హనీమూన్‌కు తీసుకుని వెళ్లింది. నలుగురు నిందితులు వీరు బసచేసిన ప్రదేశానికి కిలోమీటర్‌ దూరంలోని హోటల్‌లో దిగారు. మే 23న భర్తను ఒక కొండ ప్రాంతానికి ఫొటో షూట్‌ పేరుతో తీసుకుని వెళ్లింది. తాను అలసిపోయినట్టు నటించిన సోనమ్‌ భర్తతో బాగా వెనుక నడిచి ముగ్గురు నిందితులతో మంతనాలు జరిపింది. చంపండి అని ఆమె అనగానే వారు తమతో తెచ్చుకున్న ఆయుధంతో దాడిచేసి హతమార్చారు. రఘువంశీ మృతదేహాన్ని లోయలోకి తోసేందుకు సోనమ్‌ నిందితులకు సహకరించింది.

కీలకంగా టీ షర్ట్‌, మంగళసూత్రం..
ఘటనా స్థలికి సమీపంలో పోలీసులకు రక్తపు మరకలతో ఉన్న టీ షర్ట్‌ లభించింది. చిరపుంజికి భర్తతో బయలుదేరినప్పుడు సోనమ్‌ అదే టీ షర్ట్‌ ధరించి ఉండటాన్ని సీపీటీవీ ఫుటేజ్‌ల ద్వారా గుర్తించారు. అలాగే షిల్లాంగ్‌లోని హోటల్‌ లగేజిలో వదిలేసిన మంగళసూత్రాన్ని చూసి వారు అయ్యారు. కొత్తగా పెండ్లయిన మహిళ మంగళసూత్రం లేకుండా ఎలా ఉంటుందని అనుమానించారు. ఇవన్నీ బేరీజు వేసుకుని సోనమ్‌ బతికే ఉందని నిర్ధారణకు వచ్చారు.
రఘువంశీ అంత్యక్రియల్లో నింది తుడు రాజ్‌ కుష్వాహా పాల్గొన్నాడు. బాధపడవద్దంటూ అతడి తండ్రిని ఓదార్చాడు. ఈ విషయాన్ని రఘువంశీ కుటుంబ సభ్యులు తెలిపారు. రఘువంశీ మృతదేహం ఇండోర్‌కు తీసుకురాగానే సోనమ్‌ తండ్రి నాలుగు వాహనాల్లో జనంతో వచ్చారని, అందులో కుష్వాహా కూడా ఉన్నాడని చెప్పారు.