NationalNews

రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం ఓటింగ్ నమోదు

Share with

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 99 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. 11 రాష్ట్రాలు, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4796 మందిలో 99 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఈసీ వివరించింది. పార్లమెంట్, అసెంబ్లీలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 30 ప్రాంతాల్లోని రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగినట్టు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్, గోవా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్ మణిపూర్, మిజోరం, పాండిచ్చేరి, సిక్కిం, తమిళనాడులో 100% ఓటింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీలో 119+1 ఓట్ల కు గాను 118 ఓట్లు పోలయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఓటింగ్ లో పాల్గొనలేదు. కరోనా కారణంగా గంగుల ఓటింగ్ దూరంగా ఉండగా… చెన్నమనేని రమేష్ జర్మనీలో ఉన్నారు. ఏపీలో 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. హైదరాబాద్‌లోని తెలంగాణ శాసన సభలో వైసీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా… కరోనా కారణంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి పీపీఈ కిట్ తో ఓటింగ్ లో పాల్గొన్నారు.

జులై 21న పార్లమెంట్‌లో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయ్. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి 63 శాతానికి పైగా ఓట్లు పొందే అవకాశం సుస్పష్టంగా కన్పిస్తోంది. ఎన్డీయేతర పక్షాలు ద్రౌపది ముర్ముకు గంపగుత్తగా ఓటేసినట్టు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ జరిగితే ద్రౌపది ముర్ము మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే… జులై 25న నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు.