సీతక్క మనసులో మాట రాష్ట్రపతి ఎన్నికల్లో బయటపడిందా?
సీతక్క తెలంగాణ కు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు ఎమ్మెల్యే. ములుగు నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గంగా కేటాయించబడింది. ఈమె రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. ఈమె అసలుపేరు అనసూయ. కానీ ఆపేరు ఎవరికీ తెలియదు. సీతక్క పేరుతోనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె సుపరిచితురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ములుగు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కరోనా కష్టకాలంలోనూ, లాక్‌డౌన్ సమయంలోనూ చూపిన చొరవ ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. లాక్డౌన్ సమయంలో అడవిలో నుండి బయటకు రాలేని గిరిజనుల కోసం కాలినడకన ఎంతో శ్రమించి దట్టమైన అడవులలో తిరిగి వారికి కావలసిన సరుకులను చేరవేసారు. ములుగులో గ్రామాలన్నీ మారుమూలల్లో ఉన్నాయి. అక్కడికి రోడ్ కూడా ఉండదు. ఎడ్లబండిలోనూ, ట్రాక్టర్లలోనూ తిరిగి మరీ వారికి ఎంతో సహాయం చేసారు సీతక్క. ఆమె ఆదివాసీల, అట్టడుగు వర్గాల ఆశాదీపం. ఆమె గన్ పట్టినా, గన్‌మెన్ లతో ఉన్నా ప్రజలకోసమే పని చేసారు. అయితే ఈరోజు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ఆమె పొరపాటుకు గురై, తన ఓటును ఆమె సరిగా వినియోగించుకోలేదన్న వార్తలు గుప్పుమన్నాయ్. ఆమె విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు బదులుగా ద్రౌపదికి ఓటు వేశారని ప్రచారం జరిగింది. ఐతే వాటిని ఖండించారు సీతక్క.
ఏమంటే ఆమె స్వతహాగా గిరిజన స్త్రీ. గిరిజనులంటే ఆమెకు అంతులేని అభిమానం. ఆమె మనసు నిండా ద్రౌపదినే ఉన్నారన్న అభిప్రాయం కూడా విన్పించింది. కానీ పార్టీయే సర్వస్వమని సీతక్క తేల్చిచెప్పారు. ఓ మహిళ… అది కూడా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము… రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న తరుణంలో సీతక్క మనఃసాక్షి ఎంతగానో సతమతమయై ఉంటుంది. కానీ పార్టీ సిద్ధాంతం మేరకు తాను యశ్వంత్ సిన్హాకే ఓటేసినట్టు సీతక్క చెప్పారు.