Home Page SliderTelangana

త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు..

ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చటంతో పాటు… నైపుణ్యాల అభివృద్ధి చిరునామాగా తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే సాంకేతిక నైపుణ్యాలు నేర్పించే గమ్యస్థానంగా హైదరాబాద్ ను విశ్వ వేదికపై నిలబెట్టేందుకు అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

తెలంగాణలో గత పదేండ్లలో నిరుద్యోగం పెరిగిందని, గత పదేండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదని అన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లోనే 30 లక్షల మంది నమోదు చేసుకున్నారని, రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజా ప్రభుత్వం గుర్తించిందని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో 35 వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న యువతను తయారు చేసి.. ఉపాధికి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో చర్చలు జరిపామని, వారు ఇచ్చిన ప్రతిపాదనలతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు డిగ్రీలో చేరిన పది వేల మంది డిగ్రీ విద్యార్థులు తమ పట్టా పొందే నాటికి నైపుణ్యాన్ని నేర్చుకునేలా ఈ ప్రోగ్రాం రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ శిక్షణ పొందిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలకు ఢోకా ఉండదని అన్నారు. అవసరమైన నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎక్విప్ సంస్థను, ఈ కోర్సు సిలబస్ను రూపొందించిన బీఆర్ఎస్ఎఫ్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం నెలకొల్పిందని, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను బోర్డు ఛైర్మన్గా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఏటా వేలాది మంది యువతకు వివిధ రంగాల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ , స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారని, అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని సీఎం చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్విప్​ సంస్థ రూ. 2.5 కోట్ల చెక్కును ముఖ్యమంత్రికి అందించింది. విద్యార్థుల డేటాతో రూపొందించిన ఎక్విప్ స్కిల్ పోర్టల్ ను ముఖ్యమంత్రి ఈ వేదికపై ఆవిష్కరించారు.