‘మంత్రి రజిని మాకొద్దు’ వైసీపీలో అసమ్మతి నాయకులు
ఏపీ మంత్రి విడుదల రజినికి సీటు ఇస్తే తాము సహకరించేదిలేదని స్పష్టం చేశారు వైసీపీ అసమ్మతి నాయకులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాజకీయాలు కొత్తమలుపు తిరుగుతున్నాయి. రజిని చర్యలపై అసమ్మతి వర్గం గుర్రుగా ఉంది. వీరు ఈ మేరకు గుంటూరులోని హోటల్లో ఎంపీ, పల్నాడు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త అయిన బీద మస్తాన్‌రావును కలిసారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల నుంచి ఆమెకు అసమ్మతి ఎదురయ్యింది. నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశానికి తమకు కనీస సమాచారం కూడా లేదని వారు మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికలలో ఆమెకు టికెట్ ఇస్తే తాము సహకరించలేమని, ఆమెను మార్చి తీరవలసిందేనని పట్టుపడుతున్నారు. ఎంపీ మస్తాన్ రావు ప్రత్యేక సమావేశం ద్వారా పరిష్కరించుకుందామని నచ్చజెప్పినా వారు తగ్గలేదు. ఆమెను మార్చకపోతే స్వతంత్ర అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించారు.

