పొత్తు మాట అంటేనే… టీడీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
◆ తలలు పట్టుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకులు
◆ ఈసారి పలు కండిషన్‌లు పెడుతోన్న పవన్ కళ్యాణ్
◆ ఏపీలో పెరిగిన ఎన్నికల వేడి
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం పెరిగింది. అధికారపక్షం గడపగడపకు, ప్రధాన ప్రతిపక్షం బాదుడే బాదుడు, జనసేన పార్టీ కౌలు రైతుల సంఘీభావ సభలంటూ ఏపీలో ఎన్నికల హీట్‌ను పెంచేశాయి. వైసీపీ లేని ప్రభుత్వాన్ని రాష్ట్రంలో చూడాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ పలు సభలలో ప్రకటించడంతో కచ్చితంగా టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే ఈసారి పవన్ కల్యాణ్ గతంలో లాగా ఎలాంటి కండిషన్లు లేకుండా మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. జనసేనతో టీడీపీకి పొత్తు ఈసారి అంత ఆషామాషీ కాదని బోలెడన్ని కండిషన్లు ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు వీటన్నింటికీ ఒప్పుకుంటేనే పొత్తు పొడుస్తుందని లేకుంటే ఎవరిదారి వారు చూసుకోవాల్సిందనే మాటలు విన్పిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ తనది పాతికేళ్ల రాజకీయమని ముందు నుంచే చెబుతున్న నేపథ్యంలో ఆయన టార్గెట్ 2029 ఎన్నికలే అని తెలుస్తోంది. 2029లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పవర్ స్టార్ 2024లో సీఎం సీటును వదులుకుని టీడీపీతో పొత్తు పెట్టుకొని… కొన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచి ముఖ్యమైన శాఖలతో మంత్రి పదవులు పొందేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. కానీ ఇరు పార్టీల నేతలు ఎక్కడ బయటపడకుండా లోలోపల పొత్తులకు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సమయం వచ్చినప్పుడు మాత్రమే పొత్తులు గురించి మాట్లాడుదాం అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకునే విషయం టీడీపీ సీనియర్లకు ఇబ్బంది కలిగిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు తప్పనిసరి. జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సామాజికవర్గం ఓట్లను బేస్ చేసుకుని జనసేనను దువ్వే పనిలో ఉంది టీడీపీ. టీడీపీ పెద్దల అంచనా ఏంటంటే జనసేన పొత్తు కాదంటే కాపుల ఓట్లు వదులుకోవాల్సి వస్తుందని భయం సైకిల్ పార్టీని వెంటాడుతోంది. అయితే జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఏంటి పరిస్థితి అని టీడీపీ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు.
జనసేన అడిగిన అన్ని సీట్లు ఇస్తే చాలామంది సీనియర్లు త్యాగం చేయకతప్పని పరిస్థితి. చర్చలు కొలిక్కి వచ్చాక కొన్ని సీట్లు అయితే జనసేనకు ఇవ్వాల్సిందే. అక్కడ టీడీపీ నేతలు సీట్లను వదులుకుని మిత్రపక్షానికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. జనసేన అడిగే సీట్లు ఏంటన్నదే ప్రస్తుతం టీడీపీ నేతలను కలవర పెడుతోందట. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలు పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఉలిక్కి పడుతున్నారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన బలంగా కనిపిస్తోంది. కాబట్టి జనసేన అక్కడ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ, జనసేన కలిస్తే గెలుపు అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకులు మాట. మరి రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయా.. బలమైన వైసీపీ కంచుకోటలను దెబ్బతీస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.