NewsTelangana

కేసీఆర్ నీ నట్టింటికి వస్తా… ఏం చేస్తావో చేసుకో… ఈటల

Share with

రాజకీయాలు చేసే సత్తా ఉంది. అంతకు మించి దమ్ముంది… తెగింపు ఉంది. కొండంత అండ… ప్రజల అభిమానమూ ఉంది. ఇవి చాలు కేసీఆర్‌ను గజ్వేల్‌లో మట్టి కరిపించడానికంటూ గళం విప్పారు… తెలంగాణ ఆత్మగౌరవ పతాకగా ఈటల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తానంటూ ప్రతినబూనారు ఈటల. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఓడించి… తెలంగాణ ఉద్యమ అసలు ఫలాలను ప్రజలకు అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి… బెంగాల్‌లో మమతను ఏ విధంగానైతే సువేందు అధికారి ఓడించాడో అలాగే రాజకీయం చేసి తీరతామన్నారు ఈటల. సువేందు మమతను మాత్రమే ఓడించాడని… తాను మాత్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీని చిత్తు చేస్తాననన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురేస్తానని ఈటల జోస్యం చెప్పారు. మీడియా చిట్ చాట్‌లో ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన రాజకీయ ప్రస్థానం గజ్వేల్ నుంచి ఆరంభమయ్యిందన్న ఈటల… అర్జునుడి లక్ష్యంలా… పక్షి తలలా… గజ్వేల్ మాత్రమే కన్పించాలన్నారు. తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని ప్రశ్నిస్తారని.. కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతారన్నారు. ఇప్పటికే ఓటేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు ఈటల. టీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని… వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ దొరకరని ఈటల చెప్పుకొచ్చారు. గ్రేటర్ పరిధిలో కార్పొరేటర్లను తీసుకుంటే… పార్టీ చూస్తూ ఊరుకోదని… అంతకు అంతా కేసీఆర్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో సైతం… పార్టీ బలోపేతానికి అగ్రనేతలకు ఈటల అనేక విషయాలు సూచించారు. టీఆర్ఎస్ పార్టీని కూకటివెళ్లతో పెకిలించే తారకమంత్రంతో ప్రజల్లోకి బీజేపీ రాబోతుందన్నారు.

త్వరలోనే బీజేపీలో భారీగా చేరికలుంటాయని.. రాష్ట్ర వ్యాప్తంగా సిచ్యువేషన్ పై ఆరా తీస్తున్నామని.. అందుకు ఒక మెకనిజం పనిచేస్తోందన్నారు ఈటల. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. అందరూ టీఆర్ఎస్ ఓడిపోతుందని అంటున్నారని… ముందుగా ఓడిపోబోతోంది కేసీఆరేనని ఈటల చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అవమానానికి వడ్డీతో సహా కలిపి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో … ఈటల వాడి ఏంటో చూపిస్తానని దీమా వ్యక్తం చేశారు. ఎక్కడో పోటీ చేసేదేంటి… కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న చందంగా గజ్వేల్‌లోనే చెక్ పెడతానంటూ గళం విప్పుతున్నారు.

మరోవైపు ఈటల గజ్వేల్ వస్తే…. హుజూరాబాద్‌లో ఎవరు కంటెస్ట్ చేస్తారన్న అభిప్రాయం సహజంగా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఐతే రెండు దశాబ్దాలుగా హుజూరాబాద్ ప్రజలతో మమేకమైన ఈటల… ఆ నియోజకవర్గంలో… భార్య జమునను బరిలోకి దించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. భర్త అడుగుజాడల్లో జమున ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి… ఈటలను గెలిపించుకున్న ధీరగా ఆమెకు గుర్తింపు లభించింది. అదే ఒరవడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చూపించి… బీజేపీకి హుజూరాబాద్ సీటుతోపాటు, గజ్వేల్‌ను కానుకగా ఇస్తానంటూ ఈటల దీమా వ్యక్తం చేస్తున్నారు.