Andhra PradeshNews

ముందొచ్చిన చెవులకన్న… వెనుకొచ్చిన కొమ్ములు వాడి… వైసీపీలో సీన్ ఇదే…

Share with

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జ‌రుగుతోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఎవ‌రైనా త‌ప్పుడు స‌ల‌హాలు ఇస్తున్నారా లేదంటే సామాజిక స‌మీక‌ర‌ణాల పేరుతో ఆయ‌న‌పై ఒత్తిడి తెస్తున్నారా ప్లీన‌రీ వేదిక‌గా గౌర‌వాధ్య‌క్షురాలు, సొంత త‌ల్లి విజ‌య‌మ్మ ప‌ద‌వికి రాజీనామా చేసి నిష్క్ర‌మించారు. కానీ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి జైలులో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు కురిపించిన బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటివారు అదే వేదిక‌పై మంత్రి హోదాలో ఉన్నారు. కాలం ఎంత చిత్ర‌మైందనేదానికి ఈ సంఘ‌ట‌న‌ను ఒక ఉదాహ‌ర‌ణ‌గా భావించ‌వ‌చ్చు.

అసెంబ్లీలో ఎంతో ఇబ్బందిపడ్డ విజయమ్మ

జ‌గ‌న్ జైలులో ఉన్న స‌మ‌యంలో ఎమ్మెల్యేగా వైఎస్ విజ‌య‌మ్మ అసెంబ్లీలో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. ఆమె మాట్లాడే స‌మ‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌దే ప‌దే అడ్డుత‌గిలి జ‌గ‌న్ ఎంత అవినీతికి పాల్ప‌డ్డారు? ఎన్ని అక్ర‌మాలు చేశారు? అటువంటి వ్య‌క్తి జైలులో ఉండ‌క బ‌య‌ట ఉంటారా? అంటూ విమర్శలు గుప్పించేవారు. వాటికి స‌మాధానం చెప్ప‌లేక, అసెంబ్లీలోకి మొద‌టిసారి అడుగుపెట్టిన విజ‌య‌మ్మ ఇక్క‌ట్లు ఎదుర్కొన్నారు. అప్ప‌టి అధికార పార్టీ నేత‌లు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా త‌ట్టుకున్నారు.. షర్మిలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిల‌బెట్టారు.

కుమార్తె వెంట న‌డుస్తున్నాన‌ని చెప్పిన విజయమ్మ

ప్ర‌స్తుతం విమ‌ర్శ‌లు చేసిన అదే వ్య‌క్తి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణాలు, సీనియారిటీ హోదాలో మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. రెండోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోను త‌న ప‌ద‌వి చేజార‌కుండా కాపాడుకున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాపై త‌న‌కు ప‌ట్టుందంటూ త‌న బ‌లాన్ని జ‌గ‌న్ ద‌గ్గ‌ర చాటిచెప్ప‌డానికి ప‌లుమార్లు ప్ర‌య‌త్నించారు. కానీ సొంత కుమార్తె ఇబ్బందుల్లో ఉంద‌ని, త‌న తండ్రి ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు, తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ పెట్టి క‌ష్ట‌ప‌డుతోంద‌ని, అందుకే త‌న బిడ్డ‌ను ఇక్క‌డి ప్ర‌జ‌ల చేతుల్లో పెట్టి కుమార్తె వెంట న‌డుస్తున్నానంటూ విజ‌య‌మ్మ ప్రకటించడం పార్టీ నాయకులను, కార్యకర్తలను నివ్వెరపరిచింది.

మధ్యలో వచ్చినవారు దగ్గరవుతున్నారు

విజ‌య‌మ్మ ప్లీన‌రీ వేదిక‌గా చేసిన ప్ర‌క‌ట‌న వైసీపీ శ్రేణుల‌ను విస్మయానికి గురిచేసింది. మొద‌టి నుంచి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అండ‌గా నిల‌బ‌డిన‌వారంతా దూర‌మ‌వుతున్నార‌ని, మ‌ధ్య‌లో వ‌చ్చిన‌వారు మాత్రం ప‌ద‌వుల పేరుతో అంటిపెట్టుకున్నారంటూ కొంత‌మంది పేర్ల‌ను ఉద‌హ‌రించి వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్లీనరీలో చ‌ర్చించుకోవటం కనిపించింది. ఏది ఏమైన‌ప్ప‌టికీ వైసీపీలో ఇటువంటి ప‌రిణామాల‌ను ఊహించ‌లేద‌ని, ఇప్ప‌టికైనా మొద‌టి నుంచి పార్టీని న‌మ్ముకున్న‌వారికి న్యాయం చేయాల‌ని వైసిపి శ్రేణులు కోరుతున్నాయి.