InternationalNews

హీరో నుంచి జీరో…

Share with

బోరిస్ లండన్‌ మేయర్‌గా 2012 ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించడంతో బోరిస్‌ పేరు మార్మోగిపోయింది. 2016 నుంచి 2018 వరకు థెరెసామే ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. తర్వాత థెరిసా రాజీనామాతో జాన్సన్ ప్రధాని పదవి చేపట్టారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ను తప్పిస్తానని బోరిస్‌ హామీ ఇచ్చారు. ఈ హమీ తో 2019 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనం కన్జర్వేటివ్‌ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. కన్జర్వేటివ్‌ పార్టీకి ఏకంగా 80 సీట్ల మెజారిటీ దక్కింది. థాచర్‌ తర్వాత అత్యంత విజయవంతమైన పార్టీ నేతగా బోరిస్ పేరు పొందారు. సొంత పార్టీకి ఇటీవలి కాలంలో.. ఎన్నడూ లేనంత మెజార్టీని తీసుకురావడంలో బోరిస్ విజయం సాధించారు.
అయితే దాన్ని నిలబెట్టుకోవడంలో బోరిస్ జాన్సన్ విఫలం అయ్యారు.ప్రజలతో పాటు సహచరుల్లో విశ్వాసం కోల్పోయారు.


నిండా వివాదాల్లో మునిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు బోరిస్ జాన్సన్. కరోనా నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ కార్యాలయాల్లో… ప్రధాని అధికార
నివాసంలో మందు పార్టీలు జరిగిన వైనం 2021 నవంబర్‌లో బయటపడటంతో బోరిస్‌ అప్రతిష్టపాలయ్యారు. 2019 లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వివాదస్పద ఎంపీ క్రీస్ పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్ గా నియమిస్తూ జాన్సన్ తీసుకున్న నిర్ణయం బోరిస్ మెడకు చుట్టుకుంది. పించర్ పై గతంలో ఉన్న లైంగిక ఆరోపణలు తనకు తెలియదని బోరిస్ చెబుతూ వచ్చారు. కానీ ఆ విషయం బోరిస్‌కు ముందు నుంచీ తెలుసని బయట పడడంతో తీవ్ర దూమారం రేగింది. సొంత పార్టీ నేతలే మూక మనస్తత్వంతో దిగిపోవాలంటూ మూకుమ్మడిగా తన వెంటపడ్డారంటూ వాపోయారు. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్, సాజిద్‌ జావిద్‌ రెండు రోజుల క్రితం మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో ‘గో బోరిస్‌’ డిమాండ్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని మార్చడం సరికాదని వారికి సర్ది చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.