ఏపీ, తెలంగాణలో 2026 తర్వాత అసెంబ్లీ సీట్ల పెంపు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి… బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26 (1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15కి విఘాతంగా కలగకుండా… శాసనసభ సీట్ల సంఖ్య కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 175 మరియు 119 నుండి 225 మరియు 153కి వరుసగా పెంచుతామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించే వరకు ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను తిరిగి సర్దుబాటు చేయరాదని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచలేమని మంత్రి సమాధానంలో స్పష్టం చేశారు.