కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దారెటు..?
మునుగోడు ఉపఎన్నిక పూర్తయింది. ఇక అందరి దృష్టి కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పడింది. ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా.. సోదరుడితో పాటు బీజేపీలోకి వెళ్లిపోతారా.. అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఆయనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బలహీనపడుతుందనే భయంతో వదిలేస్తుందా.. అనే విషయంపైనా స్పష్టత లేదు. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వెంకట్‌రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర నాయకులతో పాటు అధిష్టానం కూడా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్‌గా నియమించినప్పటికీ కాంగ్రెస్‌కు ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోవడంపై అధిష్టానం ఆగ్రహం చెందింది. అంతేకాదు.. తన తమ్ముడికి ఓటేయాలని ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలకే ఫోన్ చేసి చెప్పడాన్ని తేలికగా తీసుకోలేకపోతోంది.

సాగనంపాలన్నదే రేవంత్ వ్యూహం..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం వెంకట్‌రెడ్డిపై వేటు వేయాలనే పట్టుబడుతున్నట్లు సమాచారం. తన పదవిపై కన్నేసిన వెంకట్‌రెడ్డిని సాగనంపితేనే పార్టీలో తన స్థానం స్థిరంగా ఉంటుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే వెంకట్‌రెడ్డి ఆడియో, వీడియోలను లీక్ చేసి అధిష్టానం దృష్టిలో ఆయనను విలన్‌ను చేసే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుల అండ వెంకట్ రెడ్డికి ఉంది. నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్‌కు చెక్ పెట్టాలంటే పార్టీలో వెంకట్‌రెడ్డి ఉండాల్సిందేనని సీనియర్లు భావిస్తున్నారు. అందుకే అధిష్టానాన్ని ఒప్పించేందుకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్ నుంచి తొలగిస్తే బీజేపీకి మార్గం..
వెంకట్ రెడ్డి మాత్రం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మునుగోడులో సోదరుడు రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తక్షణమే బీజేపీలో చేరేవాడని.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాగడమే మేలని భావిస్తున్నారు. తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరితే భువనగిరి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పుడు సోదరుడు ఎమ్మెల్యే పదవిని కోల్పోయాడు. తానూ ఎంపీ పదవిని కోల్పోతే కష్టమని అనుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీతో వెంకట్‌రెడ్డికి సత్సంబంధాలే ఉన్నాయి. తన సోదరుడు బీజేపీలో చేరిపోవడంతో తాను కాంగ్రెస్‌లో ఉండటమే సరైనదన్నది ఆయన భావన. పార్టీ అధిష్టానం తనపై వేటు వేస్తే ఎంపీ పదవిలో కొనసాగుతూనే బీజేపీలో చేరే అవకాశం లభిస్తుందని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి వెంకట్‌రెడ్డి మనసు బీజేపీలో.. శరీరం కాంగ్రెస్‌లో ఉందని ఆయన అనుచరులే చెబుతున్నారు. కాంగ్రెస్‌కు మాత్రం వెంకట్ రెడ్డిని పార్టీలో ఉంచుకున్నా నష్టమే.. పంపించినా నష్టమే.