Andhra PradeshTelangana

తెలుగు రాష్ట్రాల్లో జడివానలు-గోదారమ్మపరవళ్లు

Share with

ఉత్తరతెలంగాణాలో ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు అతిభారీ వర్షపాతం నమోదయ్యింది. 370 కేంద్రాల్లో అతిభారీ వర్షాలు, 200 కేంద్రాల్లో ఒక మోస్తరు వానలు నమోదయ్యాయి. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్-, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు -ఆరంజ్అలర్ట్, మిగతా జిల్లాలకు -ఎల్లోఅలర్ట్ ప్రకటించారు.

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని, అది మరింత బలపడనుందని తెలిపింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో.. తెలంగాణాలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గరిష్టంగా 19సెంటీమీటర్లు నమెదయ్యింది.ప్రతి సంవత్సరం జూన్‌ ఒకటో తేదీ నుంచి నైరుతి సీజన్‌ మొదలై సెప్టెంబర్‌ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో సాధారణంగా అయితే 72.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఇందులో జూలై 11వ తేదీనాటికి 20.39 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి జూలై 11 నాటికే ఏకంగా 39.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 94 శాతం అధికం కావడం గమనించవచ్చు.  రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. ఇందులో 29 జిల్లాల్లో అతి ఎక్కువ స్థాయిలో వానలు పడగా.. ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాలు మాత్రమే కాస్త ఎక్కువ వానల జాబితాలో ఉన్నాయి. సొమవారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 43,870 చెరువుల్లో 50 శాతం నీరు చేరింది.21 చెరువులకు గండ్లు పడ్డాయి. మిషన్ కాకతీయకు ముందు పరిస్థితితో పోలిస్తే నష్టం తక్కువే. 7900ఎకరాల్లో వరి,సోయా,మెక్కజొన్న పంటలు నీట మునిగాయి.మంత్రి సత్యవతిరాథోడ్ ములుగులో గోదారి వంతెన మీదుగా నడుచుకుంటూ వెళ్లి వరదఉధృతిని పరిశీలించి, ఏటూరునాగారం ఐటీడిఏ అధికారులను సహాయకచర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించారు. ఎగువన మహారాష్ట్రతోపాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి నదిలో వరద పోటెత్తింది. ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదుల ప్రవాహాలు కూడా కలిశాక గోదారమ్మపరుగులు పెడుతోంది. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో 53 అడుగుల మట్టంతో ఉరకలెత్తుతోంది. మొత్తంగా ఎగువన ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ దాకా గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. జూలై రెండో వారంలోనే ఈ స్థాయిలో గోదావరికి వరదలు రావడం, ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్ర నుంచే గోదావరిలో వరద పోటెత్తి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండిపోయింది. దానితో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు కడెం వాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెర సాని తదితర ఉప నదుల ప్రవాహాలూ చేరుతుండటంతో సోమవారం గోదావరిలో వరద పోటెత్తింది. ఎగువన కర్ణాటకలో వర్షాలతో కృష్ణా నదిలో వరద మొదలైంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆది, సోమవారాల్లో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. మలప్రభ, ఘటప్రభ వంటి ఉప నదులపై ప్రాజెక్టులన్నీ నిండటంతో.. కృష్ణాలోకి భారీ వరద వస్తుందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. దాంతో ఆల్మట్టి డ్యామ్‌ నిండటానికి మరో 40 టీఎంసీలు అవసరమున్నా, ముంపు ముప్పు తప్పించడానికి గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆ నీళ్లు నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. గువ నుంచి వరద వస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి 5,622 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు, పాలేరు, వైరా రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడం, తీరం దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్తగూడెం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మండలాల వారీగా గజ ఈతగాళ్లు, మరబోట్లను సిద్ధంగా ఉంచారు. 20 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం భద్రాచలం ఇప్పటికే చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల సోమవారం కూడా వానలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 913 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. అయితే అంతకు మూడు రెట్లు నష్టం జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గోదావరి వరద రోడ్లపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వందకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు వరదలో మునిగినట్టు అంచనా వేశారు. ముంపు తలెత్తే ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తు న్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ భద్రాచలంలో  సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  .  నిర్మల్‌ జిల్లాలో ఆదివారం తగ్గుముఖం పట్టిన వాన సోమవారం మళ్లీ మొదలైంది. రోజంతా వర్షం పడింది. నీట మునిగిన ప్రాంతాలు, దెబ్బతిన్న పంటలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. మామడ మండలంలో దెబ్బతిన్న రోడ్లు, పంటలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించి,  స్థానికులతో మాట్లాడారు.  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్రమత్తతతో వ్యవహరించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు.  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఆదివారం నాటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని సోమవారం కూడా సీఎం కొనసాగించారు. మంత్రులు, ప్రజాప్రతి నిధులతో ఫోన్‌లో మాట్లాడారు. వరద ముప్పు ఉన్న జిల్లాల అధికారులను అడిగి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం దిగువ కాఫర్ డ్యాంను వరద ముంచెత్తింది. పోలవరం పనులలో జాప్యంవల్లే ఈపరిస్థితి ఏర్పడిందని భారీమూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని సమాచారం.ధవళేశ్వరం వద్ద 2 వ ప్రమాదహెచ్చరిక జారీ చేసారు,12.10 క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉంది.  బంగాళాఖాతంలో ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ప్రస్తుతం ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది దీని ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం అల్లూరి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు మండలం బోరంగులలో 5.3 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. అరకు లోయ, పాడేరు, చింతూరు, హుకుంపేటలలో 3 నుంచి 3.5 సెం.మీ. వర్షం పడింది. రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.  ఈ సందర్భంగా గోదావరి ఉదృతి, వరద సహాయక చర్యలకు సీఎం జగన్‌ ఆదేశించారు.

Read more: ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. 25 గేట్లు ఎత్తివేత