NewsTelangana

భారీవర్షాలతో హైదరాబాద్‌లో  మండుతున్న కూరగాయల ధరలు

Share with

నగరంలో పెరుగుతున్న కూరగాయల ధరలతో ప్రజలు విలవిల! వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర ప్రజలు అల్లాడుతున్నారు. హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించింది.దీంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.అయితే ఈ వర్షాలు కూరగాయల దిగుమతిపై కూడా  ప్రభావం చూపుతున్నాయి.వరుసగా కురుస్తున్న ముసురు వానల కారణంగా తోటల్లోని కూరగాయలు కోసేందుకు వీలులేకుండా పోయింది.పొలాలన్నీ బురదమయం కావటంతో కూరగాయలు మరియు ఆకు కూరలను కోయడం కష్టంగా మారింది.దీంతో నగర మార్కెట్లకు వచ్చే కూరగాయల దిగుమతి  బాగా తగ్గిపోయింది.అయితే పొరుగు రాష్ట్రాల నుండి కూరగాయలను దిగుమతి చేసుకుందామంటే అక్కడ కూడా పడుతున్న వర్షాలతో రవాణాకు అంతరాయం కలుగుతుంది.ఇది కూడా కూరగాయల ధరల పెరుగుదలకు కారణం అని చెప్పవచ్చు. నిన్నమొన్నటి వరకు హోల్‌సేల్ ,రిటైల్ వ్యాపారుల వద్ద ఉన్ననిల్వలు నగర ప్రజల అవసరాలను తీర్చాయి. అయితే సోమవారం నాటికి ఆ నిల్వలు అయిపోవడంతో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కూరగాయలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు బాగా పెంచేశారు. సాధారణంగా టమోటా ధర రూ.30/- నుంచి రూ.40/- ఉండగా సోమవారం రూ.50/- లకు చేరాయి. దీంతో పాటు పచ్చిమిర్చి ధర కూడా ఘాటెక్కింది.అలాగే మిగతా కూరగాయల ధరలు కూడా పెరిగాయి.ఈ ధరల పెరుగుదలకు ముఖ్యకారణం మార్కెట్‌లో కూరగాయల దిగుమతి భారీగా తగ్గడం అని చెప్పవచ్చు.