కొండెక్కిన కూరగాయల ధరలు
కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటో, ఉల్లి పాయలు కొండెక్కి కూర్చున్నాయి. మొన్నటి వరకూ రూ.40 ,రూ.50 ఉన్న ఉల్లిపాయలు అమాంతం రూ.80 దాటేశాయి. నవరాత్రి పూర్తయ్యేసరికి సెంచరీ కొట్టేస్తుందని సమాచారం. దీనితో సామాన్యులు ఏం తిని బతకాలంటూ వాపోతున్నారు. టమాటోలు కూడా కేజీకి రూ.80 హోల్‌సేల్‌గా, రూ.100 రిటైల్‌గా అమ్ముతున్నారు. ప్రతీ ఏటా టమాటో రేట్ల హెచ్చు తగ్గులతో రాష్ట్ర రైతులు టమాటో సాగుపై ఆసక్తి చూపట్లేదని సమాచారం. దీనితో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతులు చేసుకోవల్సి వస్తోంది. ఇక నిత్యావసర ధరలు కూడా వంటింట్లో అగ్గి రాజేస్తున్నాయి. పప్పులు, నూనెలు, బియ్యం రేట్లు పెరిగి పోవడంతో చిరుద్యోగులు జీతాలు చాలక లోటు బడ్జెట్‌తో బతుకు వెళ్లదీస్తున్నారు.

