నేడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నాలుగో విడత ముగింపు సభ గురువారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు పెద్ద అంబర్‌పేటలో జరిగే బహిరంగ సభలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పాల్గొంటారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని.. సీఎం కేసీఆర్ పాలనను తూర్పారబడుతూ సాగిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని బండి సంజయ్ తెలిపారు. యూపీలోని ఫతేపూర్ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచిన సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ సభలో ఏం మాట్లాడతారనే విషయంపై ఉత్కంఠత నెలకొంది.

హైదరాబాద్‌లో సాగిన యాత్ర..
గ్రేటర్ హైదరాబాద్‌ను టార్గెట్ చేసుకుంటూ బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర 10 రోజుల పాటు సాగింది. 9 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా 115.3 కిలోమీటర్ల మేర ఆయన నడక సాగించారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజక వర్గాలను కవర్ చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రపై ఎక్కువగా దృష్టి పెట్టారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు, ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి బండి సంజయ్, సాధ్వి నిరంజన్ జ్యోతి ఏం మాట్లాడతారోనని పార్టీ శ్రేణులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

